తగిలిన దెబ్బ చిన్నదే కానీ...
ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగారు.. సాదా సీదా మంత్రి కాదు. ఏకంగా హోం మంత్రి. అలాంటి మంత్రిగారు ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న లిఫ్టు తీగెలు తెగి ఢామ్మని కింద పడిపోయిందని సమాచారం. ప్రమాదం జరిగింది ఆస్పత్రిలోనే కాబట్టి... ఆస్పత్రి వర్గాలు.. వెంటనే మేలుకుని ఆయనకు చికిత్స చేశాయి.
ఈలోగా టీవీల్లో స్క్రోలింగులు వచ్చేసరికి రాష్ట్రవ్యాప్తంగా పరామర్శల ఫోన్లు వెల్లువెత్తాయి. బెంబేలెత్తిపోయిన హోం మంత్రి చిన్న రాజప్ప.. ఆ వెంటనే.. తనకు దెబ్బలేమీ తగల్లేదని ,మోచేతికి చిన్న గాయం మాత్రం అయిందని చెప్పారు. పెద్దాపురంలో షెడ్యూలు ప్రకారం అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా అని కూడా చెప్పారు.అలాగే పాల్గొన్నారు.
కానీ హోంమంత్రిగారికి దెబ్బ తగిలితే.. ప్రపంచం ఊరుకోదు కదా..
పరామర్శలు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలు ఎవరైనా చేస్తే.. ఆయన అసిస్టెంట్లు ఫోను మంత్రిగారికి ఇవ్వకుండా ఆపగలరు గానీ, మరో మంత్రి గారు ఫోను చేస్తే ఏం చేస్తారు?
అలా ఇతర మంత్రుల ఫోను పరామర్శలు కూడా విచ్చలవిడిగా వస్తున్నాయిట. తన శాఖ పరిధిలోని విషయం కాబట్టి ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, ఇంకా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్ బాబు, ఇంకా పలువురు మంత్రులు ఆయనను పరామర్శిస్తూనే ఉన్నారుట. కామినేని అయితే అందుకున్న చికిత్స వివరాలు అన్నీ కూడా సవివరంగా తెలుసుకున్నారుట.
తగిలిన దెబ్బ చిన్నదే కానీ.. ఈ పరామర్శలు అన్నీ భరించేలోగా... దానికి మళ్లీ చికిత్స అవసరమయ్యేలా ఉందని అనుకుంటున్నారట మంత్రిగారు పాపం!