డబుల్ బొనాంజా చేరికలు జగన్ కు ఖచ్చితంగా లాభమే!
వైఎస్ జగన్మోహన రెడ్డికి, ఆయన అభిమానులకు ఇది శుభవార్త. అధికార పార్టీ ప్రాపకం ఉంటే చాలుననుకుని గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీని వీడిపోగా.. ఇప్పుడున్న ఏపీ రాజకీయ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో కొందరు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తూ ఉండడం చాలా కీలకంగా కనిపిస్తోంది. నరసరావుపేట, రాజమండ్రి ప్రాంతాల్లో పార్టీలోకి కొత్తగా నాయకులు రాబోతున్నారు. ఆషామాషీ నాయకులు కూడా కాదు. తమ తమ పార్టీల్లో ఒక స్థాయి, హోదా ఉన్నవారు. మరి వారి చేరికలు డబుల్ బొనాంజాలాగా జగన్ కు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల సమయానికి లాభించే అవకాశం ఉంది. నరసరావుపేటలో మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కొడుకు కాసు మహేష్ రెడ్డి, రాజమండ్రిలో కందుల దుర్గేష్ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఖరారైంది.
నరసరావు పేటలో కాసు కుటుంబానికి ఉన్న ఆదరణ తక్కువేమీ కాదు. ముఖ్యమంత్రిగా పనేసిన కాసు బ్రహ్మానంద రెడ్డికి స్థానికంగా ఉన్న మంచి పేరు రాజకీయంగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఆ కుటుంబానికి దన్నుగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ సాంతం ఓడిపోయినప్పుడు క్రిష్ణారెడ్డి కూడా ఓడిపోయారు. ఆయన కొడుకు మహేష్ ఇప్పుడు వైకాపాలో చేరాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే నరసరావుపేట ప్రాంతంలో వైకాపా బలంగా ఉంది. మహేష్ చేరికతో వారి బలం మరింతగా పెరుగుతుందనేది అంచనా!
అలాగే రాజమండ్రిలో కందుల దుర్గేష్ కూడా వైకాపాలో చేరబోతున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. కాంగ్రెసు భవిష్యత్తు మీద నమ్మకం లేక ఆయనే చేరిపోతుండడం విశేషం. దుర్గేష్ చేరిక కూడా వైకాపాకు బహుళార్థక లాభం చేసేలా ఉంది. ఎందుకంటే.. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. చంద్రబాబునాయుడు రిజర్వేషన్ ల కసరత్తు పేరిట ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఇప్పటికీ ఓ కాపు నాయకుడు.. తన సొంత పార్టీని వీడ దలచుకున్నప్పుడు, తెలుగుదేశాన్ని ఎంచుకోకుండా వైకాపా వైపు అడుగులు వేశాడంటే.. చంద్రబాబును కాపులు నమ్మడం లేదనే సంకేతం ప్రజల్లోకి వెళ్లడానికి ఈ పరిణామం ఉపయోగపడుతుంది. ఆ రకంగా కందుల దుర్గేష్ చేరిక వైకాపాకు మేలు చేస్తుంది. ఒకప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాపకం వలన ఎమ్మెల్సీ కాగలిగిన కందుల దుర్గేష్ ఇప్పుడు వైఎస్ పట్ల రుణాన్ని వైకాపాలో చేరడం ద్వారా తీర్చుకుంటున్నాడన్నమాట.
మొత్తానికి వైకాపా అభిమానులకు ఇవి శుభవార్తలే. ఇలాంటి కీలక నాయకుల చేరికలు మరికొన్ని రాబోయే రోజుల్లో సంభవిస్తే గనుక.. ఈసారి రాబోయే ఎన్నికలు చాలా రసవత్తరంగా మారుతాయని భావించవచ్చు.