ట్రంఫ్ - విధ్వంసకర ప్రస్థానం

"ఓడిపోవడం ఎవరికీ ఇష్టం వుండదు. బెదిరించబడటం అసలే ఇష్టం వుండదు. కానీ ఈరోజు మనం ఎక్కడ వున్నామో చూడండి. ఆందరూ మన లంచ్ తినేస్తున్నారు. మనమీదపడి బ్రతికేస్తున్నారు. మళ్ళీ మనల్నే బెదిరిస్తున్నారు. దీన్నేనా విజయం అంటారు? ఒకవేళ నేను నా వ్యాపారాన్ని ఇలాగే నడిపివుంటే నన్ను నేనే డిస్మిస్ చేసుకునే వాడ్ని. ఆమెరికా మళ్ళీ విజయ పరంపర మొదలెట్టాలి. కలసిరండి, అమెరికాని మళ్ళీ గొప్ప దేశంగా మారుద్దాం."
జూన్ 2015 ఒక మద్యాహ్నం, ప్రపంచం లోనే శక్తివంతమైన ఆఫీసుని కైవశం చెసుకోవడం కోసం డొనాల్డ్ ట్రంఫ్ తన ప్రస్తాన్నాన్ని పైవిధంగా ప్రారంభించినప్పుడు 1% ప్రజలు కూడా తనని సీరియస్ గా తీసుకోలేదు. దశాబ్దాల తరబడి అమెరికా ఎన్నికలని గమనించిన వారికి తను ఒక జోకరు లానే అనిపించడంలో విశేషం ఏమీ లేదు. అమెరికా సమాజంలో విపరీత పోకడలు వున్నప్పటికీ తమ నాయకత్వం మాత్రం సకలగుణాభిరాముడి లానే వుండాలని గట్టిగా కోరుకునేవారు. మరి ట్రంఫ్ చూస్తే, వున్న ఆస్తిని పదింతలుగా చెప్పుకునే వాచాలత్వం, మూర్తీభవించిన అహంకారం, జగద్విదిత స్త్రీలోలత్వం, తమ నాయకుడు ఎలా వుండకూడదని అందరూ కోరుకుంటారో అచ్చుగుద్దినట్టు అలానే వున్నాడు.
ప్రైమరీస్ లొ తన ప్రచారమంతా అమెరికా సమాజం కనీ వినీ ఎరుగని ధూషణపర్వమే. ప్రైమరీస్ ప్రారంభం నుంచి కనీసం సగం దూరం వచ్చేంతవరకూ తన ఓటమిపై ఎవరికీ ఎటువంటి అపనమ్మకం లేదు. అమెరికాలో వీకెండ్ పార్టీలలో సరదాగ సాగే హాస్య సంభాషణకి ఒక ప్రధాన సాధనంగానే మిగిలాడు. కానీ ప్రైమరీస్ సగం దూరం దాటగానే చాలామందిలో అనుకోనిదే ఎమైనా జరగవచ్చా అనే ఒక చిన్న అనుమానం కలుగసాగింది. తన ప్రత్యర్ధులందరూ ఒకరి తర్వాత ఒకరుగా తప్పుకుంటూవుంటే, బీజం లాగా మొదలైన అనుమానమే పెనుభూతమై వెక్కిరిస్తుంటే, ట్రంఫ్ ప్రైమరీస్ లో నెగ్గడాన్ని, మెజారిటీ అమెరికా సమాజం నిశ్చేష్టమై చుస్తుండిపోయింది.
ఇక ఎన్నికల ప్రచారం లోకి వస్తే అసలు ఇవి అమెరికా అద్యక్షుడి ఎన్నికలా, ఏమూడో ప్రపంచ దెశంలో జరుగుతున్న ఎన్నికలా అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగసాగింది. రిపబ్లికన్ పార్టీకే తన సొంత అభ్యర్ధిపై ఎటువంటి నమ్మకం లేదు. నమ్మకం సంగతి తర్వాత, హేమహేమీలైన రిపబ్లికన్ పార్టీ నాయకులు ట్రంఫ్ ని నిర్ద్వందంగా వ్యతిరేకించసాగారు. అటు చూస్తే ఒక అసాధారణ మహిళగా చాలా క్వాలిటీస్ హిల్లరీ సొంతం. పోస్ట్ గ్రాడ్యుఏట్ డిగ్రీ కలిగిన మొట్టమొదటి అమెరికా ప్రధమ మహిళగా, సెనేట్ కి ఎన్నికైన మొదటి అమెరికా ప్రధమ మహిళగా, అమెరికా విదేశాంగ మంత్రిగా, ఒకవేళ ఎన్నికైతే మొట్టమొదటి అమెరికా మహిళా అద్యక్షురాలిగా, అమెరికా సమాజం తమ అద్యక్షుడు ఎలా వుండాలని కోరుకుంటారో అలానే వున్నారు. మరి యుద్ధ భూమి ఇలా వున్నప్పుడు, గెలుపు ఏ పక్షం వైపు వుంటుందో ఎవరికైనా సందేహం ఎందుకు వుంటుంది?
అమెరికా ఎన్నికల్లో మీడియా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సాధారణంగా మీడియా రెండు వర్గాలుగా విడిపోయి చెరొక అభ్యర్ధిని సమర్ధించటం జరుగుతుంటుంది. కానీ ఈసారి మాత్రం అసాధరణంగా 90% మీడియా ట్రంఫ్ ని వ్యతిరేకించసాగింది. అమెరికా ఎన్నికల పర్వంలో జరిగే మూడు ప్రసిడెన్షియల్ డిబేట్స్ ఎన్నికలని బాగా ప్రభావితం చేస్తాయి. ఒక్క డిబేట్ లొ కూడా హిల్లరీ ని సమర్ధవంతంగా నిలువరించింది లేదు. ఇప్పటి వరకూ చేసిన వాళ్ళు సరిగా చెయలేదనే మొండి విమర్శ తప్ప ఏఒక్క సమస్యపైనా నిర్ధిష్టమైన విధానం లేదు. వ్యక్థిత్వం పరంగా చాలా నీచమైన ఆరోపణలు మీడియా వెలికి తీసింది. ఎన్నికల ప్రచారం చివరి రొజులలో తన గెలుపుపై తనకే ఏమాత్రం నమ్మకం లెదనే విషయం ట్రంఫ్ మాటలలో స్పష్టంగానే వినిపించసాగింది.
హిల్లరీ ఎన్నిక నల్లేరు మీద బండి నడకే అని ప్రపంచం అంతా అనుకుంటున్న తరుణంలో భారీ ఆధిక్యతతో ట్రంఫ్ విజయం ప్రపంచ వ్యాప్తంగా ఒక వెయ్యి ఆటం బాంబులంత విస్ఫోటనాన్ని కలిగించింది. అమెరికా సమాజం ఎంత నివ్వెర పోయిందంటే అమెరికా లాంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ఒక అధ్యక్షుడు మాకు వద్దంటూ నిరసనలు మిన్నంటడాన్ని ఎప్పుడైనా చూశామా?
ఎన్నికైన ట్రంఫ్ తో సహా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసిన ఈ ఎన్నికలని ఎలా విశ్లేషించాలి? పైపై విశ్లేషనలు ఏమాత్రం సరిపోవు. మూలాల్లోకి వెళ్ళకుండా విశ్లెషించడం ఏమాత్రం సాధ్యం కాదు. అమెరికాలో నిర్ధిష్టంగా ఏమి జరిగిందనే విషయానికి తర్వాత వద్దాం. ముందుగా మన మాజీ జాతీయ భద్రతా సలహాదారు, అమెరికా అంతర్గత వ్యవహారాల్లో నిపుణుడైన శివశంకర్ మీనన్ చెప్పినట్టు, ప్రపంచ వ్యాప్తంగా ఒక సంధి దశలో వున్న చాలా దేశాలు, మెధోసంపన్నమైన, వుదారవాద నాయకత్వం నుంచి క్రమంగా, ఒక నిరంకుశ, సంప్రదాయవాద, అదే సమయంలో బలమైన నాయకత్వం క్రిందకు వెళ్తున్నాయి . ఈ వాదనలో కొంచమైనా నిజం లేకపోలేదు.
ఇక అమెరికాలో ఎమి జరిగిందనే విషయానికి వస్తే, తనే పెంచి పోషించిన గ్లోబలైజేషన్ ఫలాలను అమెరికా చాలాకాలంపాటూ ఏకపక్షంగా అనుభవించింది. ఇప్పటికీ అనుభవిస్తూనే వుంది. కానీ తర్వాతి కాలంలో చైనా, ఇండియా వంటి వర్ధమాన దేశాలు వాటిని త్వరగానే అందిపుచ్చుకోగలిగాయి. ఈ క్రమంలో అమెరికాలో జీవన ప్రమాణాలు బాగానే మెరుగుపడినా, ఒక వర్గం ప్రజలు చాలా వుద్యోగాలు కొల్పోవలసి వచ్చింది. ఈ పరిణామం ఆ వర్గ ప్రజలకి కంటగింపుగా మారింది. ఇప్పటికీ గ్లోబలైజేషన్ ను తుడిచిపెట్టడం ద్వారా అమెరికా మనజాలదు కనుక దీన్ని ఇరుపక్షాల నాయకత్వం కూడా నిర్ద్వందంగా వ్యతిరేకించే సాహసం చేయలేదు. కానీ ట్రంఫ్, ఒక వైపు గ్లోబలైజేషన్ వల్ల అనుభవిస్తున్న ఫలాలను దాచిపెడుతూనే, దానివల్ల జరిగిన నష్టాలని మాత్రం అదేపనిగా ప్రస్తావించి నష్టపోయిన వర్గాలకి చాలా దగ్గర కాగలిగాడు. కానీ విధ్యాధికులైన అమెరికా సమాజం ఆ మాటలని నమ్మడమే అన్నిటికన్న విచిత్రం.
ఏది ఏమైనా జనవరి 20, 2017 న ట్రంఫ్ అధికార పగ్గాలు చేపట్టగానే అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తం గానూ సమీకరణాలు పెద్ద కుదుపునకే గురవ్వుతాయనే విషయం మాత్రం నిర్వివాదాంశం. ట్రంఫ్ చేతిలో అధికారం పిచ్చివాడి చేతిలో రాయి కాకుండా చూడటానికి అమెరికా రాజ్యంగం లో చాలానే చెక్స్ అండ్ బాలెన్సెస్ వున్నాయి అన్నదే ప్రస్తుతానికి సంతోషించాల్సిన విషయం. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇండియా కి లాభమా, నష్టమా అంటే, మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ లకు ఖచ్చితంగా నష్టమే కాబట్టి, వాళ్ళ నష్టమే మన లాభం. వినడానికి అంత బాగాలేకపోయినా ప్రస్తుతానికైతే ఇంతకుమించి ఏ అంచనాకూ రావడం కష్టం.
--స్పందన