ట్రంప్ విజయం : మీడియా వక్రప్రచారాలకు చెంపపెట్టు!

అమెరికా 45వ అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ అపూర్వమైన విజయాన్ని నమోదు చేసుకున్నారు. ట్రంప్ విజయం యావత్ ప్రపంచానికి చాలా రకాల సంకేతాలు ఇస్తున్నది. ప్రధానంగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో.. ప్రజల మీద తమ అభిప్రాయాలను రుద్ది.. ఫలితాలను తాము అనుకున్నట్లుగా రప్పించగలం అని మీడియా అహంకారంతో వ్యవహరించేట్లయితే.. అలాంటి వారికి బుద్ధి చెప్పేలా ట్రంప్ విజయం ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్ సాధించింది సాధారణ విజయమేమీ కాదు. హోరాహోరీగా సాగిన పోటీ కూడా కాదు. ఏక పక్షంగా 276కు పైగా స్థానాల్లో ట్రంప్ గెలిచారు. హిల్లరీ 218కి మాత్రమే పరిమితం అయ్యారు. ఇరువురి మధ్య వ్యత్యాసమూ చాలానే ఉంది. పైగా ట్రంప్, ఆయనతో పాటూ రిపబ్లికన్లు మొత్తం అమెరికాను నడిపించే మూడు వ్యవస్థలనూ సొంతం చేసుకున్నారు. అధ్యక్ష స్థానంతో పాటు అమెరికన్ కాంగ్రెస్, సెనేట్ లను కూడా రిపబ్లికన్లే గెలుచుకున్నారు. దీంతో ట్రంప్ పరిపాలనకు ఇక అడ్డే లేని పరిస్థితి ఏర్పడింది. నిజానికి గతంలో ఒబామా అధ్యక్షుడు అయినప్పటికీ.. కాంగ్రెస్ , సెనేట్ రిపబ్లికన్ల చేతిలో ఉండేవి. ఒబామాకు నిర్ణయాల్లో పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. కానీ ట్రంప్ కు అన్ని రకాలుగానూ ఈసారి విజయం వరించింది. ఎంత అపురూపంగా ట్రంప్ విజయం ఉన్నదంటే.. రొనాల్డ్ రీగన్ తర్వాత.. ఇప్పటివరకు రిపబ్లికన్లు విజయం సాధించి ఎరగని అనేక రాష్ట్రాల్లో కూడా ఈసారి ట్రంప్ ది పైచేయి కావడం గమనార్హం.
అయితే ట్రంప్ విజయం మీడియా దుష్ర్పచారాలకు చెంపపెట్టు అని కూడా పరిగణించాల్సి వస్తోంది. అమెరికాలో సాధారణంగా జనాభిప్రాయాన్ని తామే నిర్ణయిస్తుంటాం అని భావించే ప్రధాన స్రవంతిలోని పత్రికలు ట్రంప్ కు వ్యతిరేకంగా పనిచేశాయని చెప్పాలి. ఒక దశలో న్యూయార్క్ టైమ్స్ ట్రంప్ విజయావకాశాలు 7 శాతం మాత్రమేనని, హిల్లరీ విజయావకాశాలు 93 శాతం ఉన్నాయని ప్రచారం చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే వాషింగ్టన్ టైమ్స్, లాస్ ఏంజిలస్ పోస్ట్ వంటి పత్రికలన్నీ కూడా హిల్లరీకి అనుకూలంగానే పనిచేశాయి. అదే సమయంలో కొన్ని పత్రికలు ట్రంప్ కు అనుకూలత ఉన్నదనే వాదన ప్రచారంలోకి తెచ్చినా వాటికి మన్నన దక్కకుండా పోయింది.
అమెరికన్ మీడియా ప్రధానంగా ట్రంప్ కు వ్యతిరేకంగా చాలా పెద్దస్థాయిలో ప్రచారం చేసింది. ట్రంప్ ను జోకర్ గా విలన్ గా, అమెరికా వ్యతిరేక దేశాలన్నీ ఇష్టపడుతున వ్యక్తిగా ప్రొజెక్టు చేసి.. ప్రచారం చేశాయి. ఆ రకంగా ట్రంప్ కు ఉండే అవకాశాల్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాయి. మీడియా ఎన్ని రకాలుగా ప్రచారం చేసినప్పటికీ.. ట్రంప్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. అందుకే ఈ విజయం మీడియా సాగించే దుష్ప్రచారాలకు చెంపపెట్టు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.