ట్రంప్ ఘాటు నిర్ణయాలు చేటు తెస్తాయా?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ప్రపంచాన్నే కలవరం పెడుతున్నాయి. నిన్న గాక మొన్న మెక్సికో నుంచి వలసదారులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో గోడ నిర్మించాలని తీసుకున్న నిర్ణయం వివాదాస్పమైంది. అది మరిచిపోకముందే తాజాగా ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్ధులపై ఆంక్షలు విధించారు అమెరికా ప్రెసిడెంట్. ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశంలోకి ప్రవేశించనీయకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నానని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు కూడా.
శరణార్ధులకూ నో ఎంట్రీ...
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ట్రంప్ రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ట్రంప్ పై అమెరికాలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నా ఆయన ఏమాత్రం జంకులేకుండా కాంట్రవర్సీ డెసిషన్లపై సైన్ చేసేస్తున్నారు. ముస్లిం మెజారిటీ దేశాల నుంచి అనేక మంది శరణార్ధులు అమెరికాకు వలస వస్తుంటారు. ఆ దేశాల్లో నెలకొన్న పరిస్థితులను తట్టుకోలేక వారి దేశం విడిచి అమెరికాకు చేరుకోవడం కొన్నేళ్లుగా జరుగుతున్న విషయమే. ముఖ్యంగా ఇరాక్, సుడాన్, సిరియా, లిబియా, సోమాలియా, యెమన్ వంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో ముస్లింలు పొట్ట చేతపట్టుకుని అమెరికాకు పయనమై వస్తుంటారు. ఇప్పడు ఇస్లామిక్ ఉగ్రవాదం పేరుతో ట్రంప్ వారిపై కూడా ఆంక్షలు విధించనున్నారు. వలసలు వచ్చే వారిని జాగ్రత్తగా పరీక్షించే విధంగా నిబంధలను రూపొందించనున్నారు. అమెరికాలో మరో మూడు నెలల పాటు ఈ దేశం నుంచి వచ్చే వారికి వీసా ల జారీని నిలిపేస్తారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య వాదులు, హక్కుల సంఘాలు ట్రంప్ నిర్ణయంపై మండిపడుతున్నాయి. అయితే డొనాల్డ్ మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గటం లేదు. అమెరికా బాగు కోసమే తానీ ప్రయత్నం చేస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొస్తున్నారు. అమెరికాపై అభిమానం ఉన్నవారు, ఈ దేశానికి మద్దతిచ్చే వారే ఇక్కడకు రావాలని ట్రంప్ నిర్మొహమాటంగా చెబుతున్నారు.
మెక్సికోకు వార్నింగ్....
మరోవైపు మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు ఆ దేశ సరిహద్దుల్లో గోడ నిర్మించాలని ట్రంప్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదీ ఆయన ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. అయితే గోడ నిర్మాణానికి మెక్సికో వ్యతిరేకత తెలిపింది. గోడ నిర్మాణ ఖర్చుల్లో కొంత మెక్సికో భరించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని మెక్సికో తిప్పికొట్టింది. తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తేల్చి చెప్పింది. దీంతో రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గోడ నిర్మాణ ఖర్చులు భరించకపోతే ఈనెల 31వ తేదీన జరపతలపెట్టిన అమెరికా పర్యటనను రద్దు చేసుకోమని మెక్సికోకు ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ట్రంప్ వార్నింగ్ కు ఏమాత్రం భయపడని మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. సరిహద్దు దేశాల పట్ల ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా తో పాటు సరిహద్దు దేశాలకు తలనొప్పిని తెచ్చి
పెడుతున్నాయి.
- Tags
- డొనాల్డ్ ట్రంప్