ట్రంప్ గొంతులో స్టార్ బక్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఒక కాఫీ కంపెనీ గట్టి షాక్ నే ఇచ్చింది. ఏడు దేశాల శరణార్ధులకు అమెరికాలో ప్రవేశం నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అమెరికా అంతా నిరసన జ్వాలలు రగులుతున్న వేళ స్టార్ బక్స్ కాఫీ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. తమ సంస్థలో శరణార్ధులకు ఉద్యోగాలిచ్చి తీరతామని కంపెనీ ప్రకటించింది. రానున్న ఐదేళ్ల కాలంలో తాము పదివేల మంది శరణార్థులకు ఉద్యోగాలిచ్చి తీరతామని స్టార్ బక్స్ కాఫీ రిటైలర్స్ ఛైర్మన్ అండ్ సీఈవో హోవర్డ్ షుల్డ్ చెప్పారు. దీంతో అమెరికాలోనే ట్రంప్ కు ఎదురుదెబ్బ తగలింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ స్టోర్లలో శరణార్థులకు ఉద్యోగాలిచ్చే ప్రక్రియ అమెరికానుంచే ప్రారంభిస్తామని ఆ సంస్థ ట్రంప్ కు సవాల్ విసిరింది. స్టార్ బక్స్ సంస్థ అధినేత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ కంపెనీ శరణార్ధులకు ఉద్యోగాలిస్తుందని చెప్పి ట్రంప్ ది అనాలోచిత నిర్ణయమని చెప్పకనే చెప్పేశాడు ఈ కాఫీ సంస్థ యజమాని.
తప్పుడు నిర్ణయాలంటూ....
ఏడు దేశాలకు చెందిన ముస్లింలను అమెరికాలోకి రానివ్వకుండా మూడు నెలల పాటు నిషేధించడాన్ని ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ తప్పుపడుతున్నాయి. అయినా ట్రంప్ తన పని తాను చేసుకుపోతున్నారు. రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే ఒబామా హెల్త్ కేర్ చట్టాన్ని రద్దు చేయడం, మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం చేపట్టే ఫైలు పై సంతకం చేయడాన్ని హక్కుల సంఘాలతో పాటుగా ప్రపంచ దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. ఈపరిస్థితుల్లో స్టార్ బక్స్ చేసిన సంచలన ప్రకటనతో మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చే అవకాశముందంటున్నారు నిపుణులు. అయితే మరోవైపు స్టార్ బక్స్ కు అమెరికాలో ఇబ్బందులు తప్పవని కూడా చెబుతున్నారు. మొత్తం మీద ట్రంప్ కు స్టార్ బక్స్ గట్టి గుణపాఠమే చెప్పిందంటున్నారు.