ట్రంప్ అంటే ఏంటో 8 రోజుల్లోనే తెలిసింది...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. అసంతృప్తి కూడా భారీగానే పెరుగుతోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిది రోజుల్లోనే గతంలో ఏ అధ్యక్షుడికి లేనంత అసంతృప్తిని మూటగట్టుకున్నారు. గాలప్ పోల్ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పట్ల 51 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలేనని చెబుతున్నారు. ఏడు ముస్లిం దేశాల ప్రజలను అమెరికాలోకి అడుగుపెట్టకుండా మూడు నెలల పాటు నిషేధించడం, మెక్సికో గోడ నిర్మాణం, హెచ్ 1బి వీసాపై ఆంక్షలు వంటివి ట్రంప్ పై అసంతృప్తికి కారణమయ్యాయని సర్వేలో తేలింది. కేవలం ఎనిమిది రోజుల్లోనే 51 శాతం మంది అసంతృప్తిని కూడగట్టుకుని ట్రంప్ గత అధ్యక్షులకన్నా ముందున్నట్లు సర్వేలో వెల్లడయింది.
గత ప్రెసిడెంట్లకూ...
సీనియర్ జార్జ్ బుష్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టాక 1336 రోజుల తర్వాత ఆయనపై 50 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్ క్లింటన్ ఇదే శాతాన్ని చేరటానికి 573 రోజులు పట్టిందట. ఇక బరాక్ ఒబామాకయితే 936 రోజుల తర్వాత 50 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారట. కాని ట్రంప్ మాత్రం ఎనిమిది రోజుల్లోనే యాభై శాతం దాటేశారు. అదండీ ట్రంప్ అంటే... ట్రంప్ మళ్లీ ఇక ఏ నిర్ణయం తీసుకుంటాడోనని అమెరికన్ల కంటి మీద కునుకులేదట.
- Tags
- డొనాల్డ్ ట్రంప్