జైట్లీకి ఇది అధికారిక కార్యక్రమం కాదా?

ఆంధ్రప్రదేశ్ లో కోర్ కేపిటల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఇవాళ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ వస్తున్నారు. అయితే ఇది కేంద్రమంత్రి హోదాలో ఆయనకు అధికారిక కార్యక్రమమా? కాదా? అనే సందేహాలు ఇప్పుడు జనంలో కలుగుతున్నాయి. ఎందుకంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన అధికారికంగా పాల్గొనే కార్యక్రమాలకు వెళ్లడానికి రావడానికి కాగల ఖర్చులను కేంద్రప్రభుత్వమే భరిస్తుంది. ఆయన ప్రస్తుతం ఉన్న హోదా రీత్యా ప్రత్యేక వైమానిక దళ విమానాలలో పర్యటించినా కూడా ఆశ్చర్యం లేదు. అయితే అరుణ్ జైట్లీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కు రావడానికి , ఏపీ ప్రభుత్వమే ఆయనకోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తున్నది. ఈ వైనం చూస్తే కార్యక్రమం తీరుమీదే అనుమానాలు కలుగుతున్నాయి.
ఒకవైపు తమ రాష్ట్రం చాలా పేద రాష్ట్రమని, తమ వద్ద నిధులు లేవని, ప్రజలు చందాలు ఇచ్చి, ఇటుకలు ఇచ్చి రాజధాని నిర్మాణానికి సహకరించాలని చంద్రబాబునాయుడు చిలక పలుకులు పలుకుతూ ఉంటారు. అదే సమయంలో హైదరాబాదు నుంచి ఆయనతో చర్చించడానికి పవన్ కల్యాణ్ వెళ్లడానికి సిద్ధమైతే.. తాను సర్కారు వారి ఖర్చుతో ఓ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయిస్తారు. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడానికి జైట్లీ ఢిల్లీ నుంచి వస్తోంటే దానికి కూడా మన ప్రభుత్వం తరఫునే స్పెషల్ విమానం ఎరేంజి చేస్తారు?!
నిజానికి ఇదంతా సందేహాస్పద వ్యవహారంలాగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు. జైట్లీని మొహమాటపెట్టించి బలవంతంగా ఈ కార్యక్రమానికి తీసుకువస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేంద్రమంత్రి అంతటి వాడు కేంద్ర సర్కారు ఖర్చుతో ప్రయాణించలేని కార్యక్రమానికి హాజరు కావడం చిత్రమే. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అమరావతి వరకు ప్రత్యేక హెలికాప్టరు ఏర్పాటుచేసినా అర్థముంది గానీ.. ఏకంగా ఆయనను ఢిల్లీ నుంచి తీసుకురావడానికి ప్రత్యేక విమానం పెట్టడమే చిత్రంగా ఉంది.