చిన్న లంచగొండులకు పెద్ద దెబ్బ!
నోట్ల మీద నిషేధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒకే రకమైన ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం నాడు టీవీ ఛానెళ్లలో ఆర్థిక రంగ నిపుణులతో సందేహాల నివృత్తి అవకాశం కల్పించినప్పుడు ప్రజలు అడుగుతున్న సందేహాలన్నీ చాలా సాధారణమైనవి. తమ ఇంట్లో 20, 40 వేల రూపాయలు ఉన్నాయని.. వాటిని బ్యాంకులో వేసుకోవడానికి ఇబ్బంది వస్తుందా అని కూడా జనం అడుగుతున్నారు. నిజానికి ఇంత సాధారణమైన ప్రజల అవసరాలకు, నగదు మార్పిడి, లేదా తమ అకౌంట్లలో డిపాజిట్లు చేసుకుని మార్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది రాదని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పెద్ద మొత్తాల్లో అంటే కోట్లలో నల్లడబ్బు కలిగి ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది తప్పదనేది నిపుణుల అంచనాగా ఉంది.
ఆ మాటకొస్తే.. చిన్న స్థాయి, మద్యస్థాయి లంచగొండి అవినీతి అధికారుల సెక్షన్ మొత్తానికి ఇది చాలా చీకటి నిర్ణయం అనే చెప్పాలి. 500, 1000 నోట్ల డినామినేషన్ లో లంచాలు తీసుకునే ప్రభుత్వోద్యోగులు ఇలాంటి వాళ్లు అత్యధికంగా తమ లంచాల సొమ్మును క్యాష్ రూపంలోనే ఇళ్లలో దాచుకునే సంస్కృతి మన వద్ద ఎక్కువ. ఆస్తులు కొన్నా సరే.. అధికారులు దాడులు చేసి పట్టేసుకుంటున్నారనే ఉద్దేశంతో లంచాల రూపంలో కాజేసిన లక్షలు , కోట్ల సొమ్మును క్యాష్ రూపంలోనే రహస్యంగా దాచుకునే అధికార గణాలు చాలా మందే ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు మింగలేక కక్కలేక ఇబ్బంది పడతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ పౌరులు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకుని, అఫిడవిట్లు లేదా డిక్లరేషన్ ల రూపంలో వివరణలు ఇచ్చుకోవడం అయినా సాధ్యం అవుతుందేమో గానీ.. ఇలాంటి లంచగొండుల సొమ్ము ఖచ్చితంగా వృథా కావాల్సిందేనని అంచనా వేస్తున్నారు.
నల్లడబ్బు చెత్తగా మిగిలితే ఏమవుతుంది...
మోదీ నిషేధం గురించి ప్రకటించిన సమయంలోనే .. ఈ నోట్లను గనుక మార్చుకోకపోతే.. ఇవి చెత్తే ఎందుకూ పనికి రాని కాగితాలే అని తెగేసి చెప్పారు. దేశంలో ఉదాహరణకు కొన్ని లక్షల కోట్ల రూపాయల నల్లధనం ప్రజల వద్ద ఉన్నదని అనుకుంటే ఇప్పుడు వారు ఆ నల్లధనాన్ని మార్చుకోలేకపోతే ఏమవుతుంది. ఈ గడువుల పర్వం ముగిసే సమయానికి దేశ మొత్తం ఆర్థిక సంపదలో జాతీయ సంపద కొన్ని లక్షల కోట్లు తేడా వచ్చేస్తుంది కదా! అనే అనుమానం చాలా మందికి కలుగుతోంది.
అయితే నల్లడబ్బు బ్లాక్ అయిపోవడం వల్ల జాతీయ సంపద పరంగా వచ్చే కొత్త ఇబ్బంది ఏమీ లేదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చెలామణీలో ఉండే డబ్బు విలువ ఆధారంగానే , రిజర్వు బ్యాంకు కొత్త నగదును ముద్రించడం వంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయని.. అలాంటిది ఇప్పటికే చెలామణీలో లేకుండా నల్లడబ్బుగా రహస్య అరల్లో మూలుగుతున్న సొమ్ము జాతీయ సంపదగా గుర్తింపులో ఉన్నట్లు కూడా కాదని.. కాబట్టి ఆ డబ్బు వైట్ మనీగా మారినా మారకపోయినా.. ఆర్థిక వ్యవస్థకు వచ్చే గణనీయమైన మార్పు ఉండదని అంచనా వేస్తున్నారు.
అవినీతి పరులు, నల్లడబ్బు కలిగి ఉన్న వారిలో కూడా కొన్ని తరగతుల వారు బాగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని, కొందరు సేఫ్ అవుతారని అంచనాలు సాగుతున్నాయి.