చంద్రబాబు లేఖను బుట్టదాఖలు చేసిన మోదీ!
రెండు రోజుల కిందట ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ 500, 1000 నోట్లను నిషేధిస్తున్నట్లుగా ప్రకటించిన కొద్ది సేపటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా మీడియా ముందుకు వచ్చారు. మోదీ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే మిత్ర పక్షంగా అందులో ఆశ్చర్యం లేదు. అయితే ఈ రెండు డినామినేషన్ నోట్లను రద్దు చేయాల్సిందిగా.. కొన్ని వారాల కిందట తాను మోదీకి లేఖ రాసిన సంగతిని చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. అనగా.. తన లేఖ కూడా మోదీ నిర్ణయానికి ఒక స్ఫూర్తి కారకమై ఉంటుందని చంద్రబాబునాయుడు స్వయంగా చెప్పుకున్నారు.
నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలోని కీలక అంశాల గురించి మర్మం బోధపడిన తర్వాత.. ఈ రెండు పెద్ద డినామినేషన్ నోట్లను నిషేధించడం జరుగుతోంది గానీ.. మోదీ కొత్తగా ఇంతకంటె పెద్ద డినామినేషన్ తో 2000 నోట్లను కూడా తేబోతున్న సంగతి అవగతమైంది. అప్పుడు చంద్రబాబునాయుడు ఒకింత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. రాజకీయ అవినీతి, ఎన్నికల్లో సొమ్ము పంపకాలు ఇవీ.. 1000 నోట్లకే జాస్తిగా జరుగుతున్నాయనుకుంటూ ఉంటే, మళ్లీ 2000 నోటు కూడానా.. అసలు అంత పెద్ద డినామినేషన్ నోటు తేవాల్సిన అవసరం ఉందా అంటూ ఆయన బహిరంగంగానే ప్రశ్నించారు. అయితే మోదీ రద్దు నిర్ణయం వెనుక తన లేఖ కూడా ఒక స్ఫూర్తి కారకం అనే భావన ఆయన తొలగినట్లుగా లేదు.
కానీ గురువారం సాయంత్రానికి కేంద్ర సర్కారు, ఆర్బీఐ నిర్ణయాల్లో పూర్తి సంగతులు తెలుస్తున్నాయి. నిజానికి 500 నోటును నిషేధించడం జరగలేదు. పాత నోట్ల స్థానే కొత్త నోట్ల మార్పిడి మాత్రమే జరిగింది. అలాగే కొత్తగా 2000 నోటు వచ్చింది. ఆర్బీఐ గురువారం నాడు.. తొందర్లోనే 1000 రూపాయల కొత్త నోటు కూడా వస్తుందని వెల్లడించేసింది. ఇక చంద్రబాబునాయుడు తన లేఖలో కోరిన అంశాలను మోదీ పట్టించుకున్నది ఎక్కడ? నల్లధనం కట్టడి చేయడానికి పెద్ద నోట్లను పూర్తిగా నిషేధించడం అనే అంశం గురించి చంద్రబాబునాయుడు తపన పడగా.. మోదీ తన నిర్ణయాల్లో ఎక్కడా ఆ ఊసు కూడా పట్టించుకోలేదని స్పష్టం అయిపోతోంది. రేపటి పరిస్థితిని ఆలోచిస్తే.. 500, 1000 నోట్లు యథాతథంగా అలాగే కొత్త నోట్ల రూపేణా ఉంటాయి. అదనంగా వాటికి మరింత పెద్ద డినామినేషన్ తో 2000 నోట్లు కూడా జత కలుస్తాయన్నమాట. మోదీ తాను తలచుకున్న వ్యూహమేదో దాని ప్రకారం.. తన నిర్ణయాలు తీసుకున్నారే తప్ప.. చంద్రబాబునాయుడు రాసిన లేఖను, అందులోని ప్రాక్టికల్ ఆలోచనను నామమాత్రంగా కూడా పరిగణనలోకి తీసుకోలేదని దీంతో అర్థమవుతోంది.