గాలి వారసుల ఫైటింగ్.....ఫ్యూచర్ ఏంటి..!

దివంగత టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడి ఆకస్మిక మృతితో చిత్తూరు జిల్లా నగరి రాజకీయాల్లో పెద్ద శూన్యత ఏర్పడింది. ముద్దుకృష్ణమ మరణం టీడీపీకి చాలా తీరని లోటు. గత ఎన్నికల్లో నగరిలో రోజా చేతిలో ఆయన 900 స్వల్ప ఓట్ల తేడాతో ఓడినా చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు గాలి హఠాన్మరణంతో ఆయన వారసత్వం కోసం ఆయన వారసుల మధ్య వార్ నడుస్తోందన్న టాక్ అటు నగరి నియోజకవర్గంతో పాటు టీడీపీలోనూ వినిపిస్తోంది.
భాను ప్రకాష్ నియోజకవర్గంలో...
వాస్తవానికి గాలి తన వారసుడిగా పెద్ద కుమారుడు భానుప్రకాష్ నాయుడిని తెరమీదకు తీసుకు రావాలని అనుకున్నారు. గత ఎన్నికల నుంచి ఈ నాలుగేళ్లలో ఆయన నియోజకవర్గంలో తండ్రి తరపున పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేశారు. తండ్రి నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్న సాఫ్ట్ కార్నర్‌తో ఆయనకు నియోజకవర్గంలో మంచి పట్టుఉంది. అయితే తండ్రి ఉన్నంత సేపు రాజకీయంగా తెరవెనకే ఉన్న రెండో కుమారుడు జగదీష్ సడెన్‌గా తెరమీదకు వచ్చారు. జగదీష్ ఏకంగా తండ్రి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంతో పాటు నగరి ఇన్చార్జ్ బాధ్యతలు కూడా తనకు ఇవ్వాలని చంద్రబాబును కలిసి తాను పోటీలో ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు.
వారసుల వార్తో భార్యకే ఎమ్మెల్సీ సీటు...
గాలి వారసులు ఇద్దరూ సీట్ల కోసం పోటీ పడడంతో వాళ్లలో ఎవరికి ఎమ్మెల్సీ ఇచ్చినా మరొకరు తీవ్రంగా విబేధిస్తారని భావించిన చంద్రబాబు వారి మధ్య సయోధ్య కుదరేలా లేదని చివరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. గాలి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆయన భార్య గాలి సరస్వతమ్మకు ఖరారు చేశారు. చిత్తూరు ఎమ్మెల్సీ ఉపఎన్నిక మే 21 న జరుగనుంది. గాలి తనయులు ఇద్దరూ పోటీ పడడంతో మధ్యే మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. సరస్వతమ్మకు టిక్కెట్ ఇవ్వడంతో కుమారులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఇప్పుడు ఓకే... అసెంబ్లీ సీటు ఎవరికో....
గాలి అంటే చంద్రబాబుకు ఎంతో నమ్మకం.. ఈ క్రమంలోనే వారి వారసులను కూడా పార్టీలో ఎంకరేజ్ చేసేందుకు బాబు సుముఖంగానే ఉన్నారు. వారసుల మధ్య సయోధ్య లేకపోవడంతో వాళ్లలో ఎవరో ఒకరికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ సీటును ఇప్పుడు మధ్యేమార్గంగా భార్యకు ఇచ్చారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మహా అయితే 7-8 నెలలు మాత్రమే ఉంది. త్వరలోనే నగరికి పార్టీ తరపున ఇన్‌చార్జ్‌ను ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు సరస్వతమ్మకు ఎమ్మెల్సీ ఇచ్చి వ్యూహాత్మకంగా వ్యవహరించిన బాబు మరి నగరి ఎమ్మెల్యే సీటు విషయంలో ఏం చేస్తారో ? అన్నది సస్పెన్స్‌గా ఉంది.
భాను వైపే ....
వాస్తవంగా చూస్తే చంద్రబాబు, లోకేష్‌తో పాటు పార్టీలో కీలక సీనియర్లు అందరూ పెద్ద కుమారుడు భానుప్రకాష్ వైపే ఉన్నారు. అయితే ఇప్పుడు సడెన్‌గా రేసులోకి వచ్చిన రెండో కుమారుడు జగదీష్ హల్చల్ చేస్తున్నాడు. ఈ వివాదాన్ని పెద్దది చేసేందుకు ఇష్టపడని బాబు ఇప్పుడు గాలి భార్యకు ఎమ్మెల్సీ ఇచ్చారు. రేపు మరి వీరి మధ్య ఎలాంటి సయోధ్య చేస్తారో ? చూడాలి.