కోదండం : ఏకు మేకుగా మారడం గ్యారంటీ!
ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జేఏసీ సారధిగా చాలాకాలంగా ప్రజాకార్యక్రమాల్లోను, ప్రజాపోరాటాల్లోను భాగంగానే ఉంటున్నారు. కేసీఆర్ సర్కారు రైతు వ్యతిరేక ధోరణులను మార్చుకోవాలని , రైతుల సమస్యలు వారికి ఎదురౌతున్న ఇబ్బందుల పట్ల ఆత్మవంచన లేకుండా స్పందించాలని కోదండరాం తొలినుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి డిమాండ్లతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. అయితే అడపా దడపా కోదండరాం విమర్శలకు సమాధానం ఇవ్వడం వరకే గులాబీ శ్రేణులు ఇన్నాళ్లూ పరిమితం అవుతూ వచ్చాయి. ఇప్పుడే ఇటీవలి పరిణామాల్లోనే కోదండరాం పై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కోదండరాం ను కాంగ్రెస్ పార్టీ ఏజంటుగా, వారి తరఫున పోరాటానికి వచ్చిన శిఖండిగా అభివర్ణించడం హేళన చేయడం చాలా తీవ్రమైన అంశాలు. అయితే ఒక్కసారిగా కోదండరాం మీద గులాబీ శ్రేణులు ఎందుకు దూకుడు పెంచినట్లు? అంటే.. పార్టీలోని విశ్వసనీయ వర్గాల ద్వారా భిన్నమైన సమాచారం తెలుస్తోంది.
కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జేఏసీ చాలా చురుగ్గా వ్యవహరిస్తూ.. రాజకీయ పార్టీలు కూడా చేయనంత స్పష్టంగా ప్రజల తరఫున నిలబడుతూ మాట్లాడుతూ ఉన్న సంగతి తెలిసిందే. పైగా ఈ జేఏసీకి తెలంగాణ అన్ని జిల్లాల్లో కార్యవర్గాలను నియమిస్తూ.. జేఏసీ కార్యకలాపాలను మరింత పరిపుష్టం చేయడానికి కూడా కోదండరాం ప్రయత్నాలు ప్రారంభించారు. రాజకీయపార్టీ లకంటె నిర్మాణాత్మకంగా రాష్ట్రవ్యాప్త వ్యవస్థీకృత సంస్థగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. జేఏసీ బలపడే కొద్దీ గులాబీ సర్కారుకు చికాకులే అని వారు భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలనే ఉద్దేశంతో ప్రారంభంలోనే జేఏసీ చిత్తశుద్ది నిబద్ధత లపై ప్రజల్లో సందేహాలు నాటే ప్రయత్నం గులాబీ శ్రేణులు చేస్తున్నాయి.
అయితే ఇలాంటి బెదిరింపులకు లొంగేది లేదని కోదండరాం చాలా స్పష్టంగా అంటున్నారు. తెరాస వారి విమర్శలకు, ఒత్తిళ్లకు లొంగేది లేదని.. జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, రైతుల తరఫున పోరాడుతుందని, బంగారు తెలంగాణ సాధన దిశగా సాగుతుందని చెబుతున్నారు. రాజకీయ శక్తి కాదు గనుక.. కోదండరాం ఉద్యమాల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది లెమ్మని ప్రభుత్వం ఉపేక్షిస్తూ పోతోంటే.. ఆయనే ఏకు మేకుగా మారే పరిస్థితి కనిపిస్తోందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. కోదండరాం బెడద అనేది ముదరక ముందే దాన్ని వదిలించుకోవాలని ఆరాటపడుతున్నాయి.