కొత్త నోట్లు -- ఒక బ్యాంక్ ఉద్యోగి కష్టాలు
నేను చూసిన కొత్త పాత నోట్ల ముచ్చట్లు
500,1000 నోట్లు చెల్లవనే విషయం మొదట వాట్సాప్ మెసేజ్ చేరవేసింది. అది చదవగానే మొదట అర్ధం కాలేదు. టి.వి. లో చూడగానే దాని గురించి అర్ధమైంది. కొత్త వంద నోట్లు,చిన్న నోట్లు దాచుకునే సరదా నాకు ఉండటం వలన ఇంట్లో పెద్ద ఇబ్బందులు ఎదురు కాలేదు. నా బ్యాగ్ లన్నీ వెతికితే దొరికింది ఒకే ఒక ఐదు వందల నోటు.
ఆశ్చర్యమేంటంటే అమ్మ,పెద్దమ్మ దగ్గర సీక్రెట్ గా దాచుకున్న డబ్బులు ఒక్కొక్కరి దగ్గర దాదాపు పదిహేను ఇరవై వేలు బయటకి తీశారు. (అత్తమ్మ దాచుకున్న డబ్బు పాపం నా దగ్గర చూపలేదు నా దగ్గర నుంచి మామయ్య గారు కూపీ లాగుతారేమో అన్న అనుమానంతోనేమో. అత్తమ్మ ఫోన్ చేసి పిలవటంతో మరుసటి రోజు మా ఆడపడుచు కి మా ఇంట్లో పనిపడింది.ఆ తరువాత మా ఆడపడచుకి బ్యాంకులో పని పడింది.😊).
ఆ రోజు నుంచి మొదలయ్యాయి బ్యాంకులో అవస్థలు. అసలే జనానికి బ్యాంకు సిబ్బంది అన్నింటికీ చిరాకు పడిపోతారు అనే అభిప్రాయం మా మీద. అయినా అది జనాల తప్పు కాదు బయటి నుంచి అద్దాల లో నుంచి చూసే వారికి మేం హాయిగా కూర్చుని ఉద్యోగం చేస్తున్నట్లు కనిపిస్తాం మరి. మా కష్టాలను ఇప్పుడు మీకు చెప్పను లెండి.మీకు కష్టాలేముంటాయి అన్నట్లు అలా చిరాకుగా చూడకండీ.
రెండు వారాల నుంచీ ఎదురు చూసిన రెండో శనివారం, ఆదివారం సెలవులు లేవనేయటంతో వేరే ఊరిలో ఉద్యోగం చేస్తున్న మా వారి దగ్గరకు వెళ్లి తన పుట్టిన రోజు నాటికి తనతో ఉండాలనుకున్న నా కోరిక తీరకుండా పోతున్నందుకు బోలెడంత ఏడుపు లాంటి భావమేదో వచ్చేసింది. అయినా కూడా తన పుట్టిన రోజు ముందు రోజు బ్యాంక్ ముగిసాక బయల్దేరి అక్కడికి రాత్రి తొమ్మిదింటికి చేరి మళ్లీ తన పుట్టిన రోజు వేకువ ఝామున బయలు దేరి వచ్చేసాను.ఇక నా సంగతులు వదిలేద్దాం.
నడవటానికి కష్టమయ్యే స్థితిలో ఉండి పేదవారిలా కనిపించే పెద్ద వయస్సు వారు కూడా ఒక్కొక్కరు యాభై వేలు అంత కంటే ఎక్కువ మొత్తాలు పూర్తిగా దుమ్ము ధూళి పట్టిన నోట్ల కట్టలు తెచ్చారు వాటి ధూళి వలన నాకు అప్పుడు మొదలైన జలుబు,తుమ్ములు ఇంకా తగ్గలేదు. లంచగొండి అధికారుల డబ్బు వాళ్ల ఆఫీస్ లో పనిచేస్తున్న,రిటైరైన స్వీపర్ కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి చేరిపోయింది.చూస్తూ కూడా కొన్ని సార్లు ఏమీ చేయలేని పరిస్థితి.
కొత్త రెండు వేలు నోటు చూడగానే ఇదేంటి ఇలా ఉంది బాలేదు అని కొందరంటే, కొంతమంది ఆ నోటు అందుకోగానే కళ్ల కి అద్దుకుని ముద్దు పెట్టుకున్నారు. ఇన్ని రోజులలో చాలా మంది కోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. వారి దగ్గరున్న పాత నోట్ల ని కొత్త నోట్లుగా మార్చుకోవటం లో సహకరించలేదని పరిచయస్తుల నుంచి కోపాన్ని,ఎక్కువ కొత్త నోట్లు అందుబాటులో లేక అందరికీ ఎంతో కొంత డబ్బు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో తక్కువ డబ్బు మాత్రమే అకౌంట్ నుంచి తీసుకెళ్లమన్నందుకు ఖాతాదారుల కోపం భరించవలసి వచ్చింది. ఉదయం వేగం బ్యాంకుకు వెళ్లి రోజంతా జనాలతో తిట్లు తిని దాదాపు రాత్రి పడుకునే వేళకి ఇంటికి చేరే సరికి ఒంట్లోని శక్తి శూన్యమైపోతుంది.ఇంత అలసట లో కూడా అప్పుడపుడు ఇష్టమైన బ్లాగులు చదువుకున్నాను. ఇక ఉంటానండీ.
-- మహి విష్ణుప్రియ