కొత్త ఆలోచనలు చేస్తేతప్ప కష్టాలు తీరవు!
నోటు దెబ్బకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. డిజిటల్ లావాదేవీల దిశగా సంస్థలన్నీ అడుగు వేస్తున్నాయి. అయితే తెలంగాణ ఆర్టీసీ ఇంకా పాచిపోయిన పాత పద్ధతులనే పట్టుకుని వేలాడుతుండడం విశేషం. పాచిపోయిన పద్ధతుల్ని కొత్తగా తమ వద్ద అమల్లో పెట్టాలని అనుకుంటూ.. అక్కడితో ప్రజల కష్టాలన్నీ తీరిపోయినట్లే అని సెలవిస్తున్నారు తప్ప.. వాస్తవానికి జనం కష్టాలను దూరం చేయడానికి, వారికి మరింత సౌలభ్యంగా ఉండడానికి మరిన్ని కొత్త పద్ధతులు, కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని దాన్ని తాము అందిపుచ్చుకోవాలని తెలుసుకోలేకపోతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ బస్సు స్టేషన్లలో టికెట్ల విక్రయానికి డెబిట్, క్రెడిట్ కార్డులను స్వైప్ చేసే పద్ధతిని అమల్లోకి తీసుకురావాలని అనుకుంటోంది. ఇందులో కొత్తదనం ఏముంది.. కొన్నేళ్లుగా అలవాటైన వ్యవహారాలే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ తెలంగాణ ఆర్టీసీకి ఇదే కొత్త పద్ధతి. అది కూడా తామేదో పెద్ద ప్రయోగం చేసేస్తున్నట్లుగా.. ప్రయోగాత్మకంగా హైదరాబాదులోని మూడు బస్సుస్టేషన్లలో మాత్రం ప్రవేశపెడతారుట. సక్సెస్ అయ్యే తీరును బట్టి.. జిల్లా బస్సుస్టేషన్, ముఖ్య బస్సుస్టేషన్ లలో పెడతారుట. ఇంతా కలిపి.. బస్సు టికెట్లు విక్రయించే చోట ఓ స్వైపింగ్ మెషిన్ పెట్టడానికి ఇంత హడావిడి చేస్తున్నారు.
నిజానికి ఇవాళ్టికి టెక్నాలజీ పూర్తిగా కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే.. జనం కష్టాలను దూరం చేయడం పెద్ద విశేషం ఎంతమాత్రమూ కాదు. నిజానికి ఆర్టీసీ బస్సుల్లోనే కార్డు ద్వారా టికెట్లు కొనుగోలు చేసేలా ఈ పోస్ మెషిన్లను, స్వైపింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చి.. దానిని సఫలవంతంగా నడిపితే అప్పుడు వారు గొప్ప ఫలితం సాధించినట్లు అవుతుంది. గ్రామీణ బస్సుల్లో కూడా వైఫై సౌకర్యం కల్పిస్తాం అంటూ డాంబికాలు పలుకుతున్న తెలంగాణ ఆర్టీసీ ప్రతి బస్సుల్లోనూ కార్డు ద్వారా (రద్దీ దృష్ట్యా సిటీ బస్సులు మినహా) ఎందుకు తీసుకురాకూడదు? అనేది ప్రజల ప్రశ్న. నిజానికి ప్రతి బస్సు సర్వీసులోనూ కార్డు మరియు డబ్బు రెండు రూపాల్లోనూ చెల్లించే వెసులుబాటు పెడితే.. అది సంస్థకే లాభిస్తుందని వారు తెలుసుకోవాలి.
అలా కొత్త ఆలోచనలు చేసినప్పుడు జనం కష్టాలు తీరుతాయే తప్ప... ఇంత లేటుగా మూడు బస్సుస్టేషన్లలో స్వైపింగ్ మెషిన్లు పెడుతున్నందుకు వారు సిగ్గుపడాలి.