కేసీఆర్...మజాకా...?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాల మీద వ్యూహాలు పన్నుతున్నారు. ప్రత్యర్థులకు గుక్కతిప్పుకోకుండా చేస్తున్నారు. కులాలు, మతాలు, వర్గాల వారీగా వరాలను ప్రకటిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండటంతో విపక్షాలు బిత్తరపోతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు గడువున్నా ఇప్పటినుంచే కేసీఆర్ దూకుడు పెంచారు. అన్ని కులాల వారిని మంచి చేసుకునే ప్రయత్నంలో పడ్డారు కేసీఆర్.
కులాల వారీగా వరాలు...
కేసీఆర్ మేధస్సుకు అవతలి వారు చిత్తవ్వాల్సిందేనన్నది అందరూ అంగీకరించేదే. ఆఖరకు ప్రత్యర్ధులు కూడా ఈ విషయాన్ని సన్నిహితుల వద్ద ఒప్పుకుంటారు. అటువంటి కేసీఆర్ అధికారంలో ఉంటే ఊరికే ఉంటారా?. గత రెండు నెలలుగా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో విపక్షాలకు ఊపిరాడటం లేదు. కులాల వారీగా వరాలు ప్రకటిస్తూ వారిని గులాబీ దళానికి దగ్గర చేర్చే ప్రయత్నంలో పడ్డారు కేసీఆర్. క్రిస్టియన్లకు క్రిస్మస్ సందర్భంగా కానుకలు అందజేసిన ముఖ్యమంత్రి వారికి భవనం కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక ముస్లింల కోసం రంజాన్ కానుకలు ఇవ్వడమే కాకుండా సమావేశాల ఏర్పాటుకు బహుళ అంతస్తు భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఇటీవల బసవజయంతి సందర్భంగా లింగాయత్ లకు కూడా వరాలు ప్రకటించేశారు. ట్యాంక్ బండ్ బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు కోటి రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాలును కూడా నిర్మిస్తామని చెప్పారు.
ఎన్నికలు రెండున్నరేళ్లు ఉండగానే...
ఇక బ్రాహ్మణలను ఆకట్టుకునేందుకు బ్రాహ్మణ సేవా సంస్థను ఏర్పాటు చేశారు. దానికి పూర్వపు ఐఏఎస్ అధికారి రమణాచారిని నియమించారు. బ్రాహ్మణులకుకూడా వసతి గృహాన్ని ఏర్పాటు చేస్తామని, ధార్మిక కార్యక్రమాలకు చేయూతనిస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇక యాదవులను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. యాదవులకు ఈ బడ్జెట్ లో పెద్ద పీట వేయనున్నట్లు చెప్పారు. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లను ప్రతి కుటుంబానికి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇక దళితులను ఆకట్టుకునేందుకు ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ ను ముందుకు తీసుకెళుతున్నారు. ప్లాన్ ను అమలు చేసేందుకు ఇటీవల సంబంధిత ఎమ్మెల్యేలతో కూడా సమావేశమయ్యాయరు. ఎస్సీ రిజర్వేషన్ అమలు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్లు తాజాగా కేసీఆర్ ప్రకటించారు. వరుసగా కులాల వారీగా కేసీఆర్ వరాలు ప్రకటిస్తుండటంతో విపక్షాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. అయితే ఇవన్నీ లబ్దిదారులకు చేరితే కదా? కేసీఆర్ ఇచ్చిన...ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే పదేళ్లు పడుతుందని విపక్షాలు వ్యంగాస్త్రాలు విసురుతున్నాయి. కాని ఇవేమీ పట్టించుకోకుండా కల్వకుంట్ల తనకు నచ్చిన విధంగా తాను చేసుకుపోతున్నారు.
- Tags
- కేసీఆర్ వరాలు