కేసీఆర్ ఆ ఏడుగురిని తొలగిస్తారా?

ముఖ్యమంత్రి కేసీఆర్ కొందరు మంత్రులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? మంత్రివర్గంలో ఉన్న కొందరి పనితీరుపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటి వారిని మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వాళ్లకు అవకాశమివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కొత్త వాళ్లయితే రెట్టించిన ఉత్సాహంతో జనంలోకి వెళ్లి ఇటు పార్టీకి, ప్రభుత్వానికి ఉపయోగపడతారని పెద్దాయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అందుకోసం వచ్చే నెలలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఏడుగురికి ఉద్వాసన తప్పదని చెబుతున్నారు.
మూడేళ్లుగా అదే పనితీరు....
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతుంది. మంత్రిగా ఉన్న రాజయ్యను తప్పించి ఆయన స్థానంలో కడియం శ్రీహరిని తీసుకున్నారు. తర్వాత తలసాని, తుమ్మల నాగేశ్వరరావును కూడా మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. ఆ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించిందీ లేదు. మార్పులు చేర్పులు చేసిందీ లేదు. మూడేళ్లు గడస్తున్నా కొందరు మంత్రులు తమ పనితీరులో మార్పు తెచ్చుకోకపోవడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. అనేకసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో వారిని మంత్రివర్గం నుంచి తప్పించడమే మేలన్న అభిప్రాయంలో గులాబీ బాస్ ఉన్నారు.
శాఖపైన కూడా అవగాహన లేకుండా...
కేసీఆర్ మంత్రివర్గంలో ఆయనతో సహా మొత్తం 18 మంది మంత్రులున్నారు. వీరిలో ఏడుగురు మంత్రులు సక్రమంగా పనిచేయడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. కనీసం వారి జిల్లాల్లో కూడా వారి పనితీరు బాగా లేదని నివేదికల ద్వారా ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. కనీసం విపక్షాలు చేసే విమర్శలకు కూడా వారు స్పందించక పోవడాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. కేవలం బుగ్గకారులో తిరగడం తప్ప శాఖపైన కూడా అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయని వారిని ఇక కొనసాగించడం అనవసరమని కేసీఆర్ ఒక డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెబుతున్నారు. ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. ఈ ఆవిర్భావ వేడుకలకు ముందే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అయితే కేసీఆర్ మంత్రులు పోచారం శ్రీనివాసులురెడ్డి, లక్ష్మారెడ్డి, జోగురామన్న, అజ్మీరా చందూలాల్, నాయని నరసింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు పనితీరుపైన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.