కులాలపై కన్నేసిన పార్టీలు

ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో అతిరధ మహారధులు దిగడంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మ్యానిఫేస్టోలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన పార్టీలు...ఇప్పుడు మాటలతో తమ పరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ తరుపున యూపీలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇటు కాంగ్రెస్, ఎస్పీ కూటమి తరుపున రాహుల్, అఖిలేష్ లు రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. రాహుల్, అఖిలేష్ రోడ్ షోలకు విశేష స్పందన లభిస్తోంది. మోడీ కూడా ప్రచారంలో దూసుకుపోతుండటంతో కమలనాధులు కూడా జోష్ మీదున్నారు. మరోవైపు మాయావతి నిశ్శబ్దంగా తాను ప్రచారం చేసుకుపోతోంది. తన ఓటు బ్యాంకును కాపాడుకునే ప్రయత్నంలో మాయావతి ఉన్నారు.
ముస్లింలను మచ్చిక చేసుకునేలా...
ముస్లిం ఓటర్లపైనే అన్ని పార్టీలూ ప్రధానంగా దృష్టిపెట్టాయి. గత మూడు ఎన్నికల్లో వీరే నిర్ణయాత్మక శక్తిగా మారడటంతో ఈసారి కూడా ముస్లింఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయాయి పార్టీలు. ఉత్తరప్రదేశ్ లో మొత్తం జనాభాలో ముస్లింలు 18.4 శాతం మంది ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయమని గత ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వీరు ఎటు వైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తిగా మారింది. బీఫ్ రగడతో ముస్లింలకు బీజేపీ దూరమయిందనే చెప్పవచ్చు. నిన్నమొన్నటి వరకూ ఎస్పీ పక్షాన నిలిచిన ముస్లిం ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ కూడా జత కలవడంతో ఆ ఓటు బ్యాంకు తమదేనని ఈ కూటమి భావిస్తోంది. మాయావతి మాత్రం ముస్లిం లు తమనే నమ్ముతున్నారని, ఎస్పీ పాలనలో ముస్లింలకు భద్రత లేకుండా పోయిందని, ఇది వారు అర్ధం చేసుకున్నారని చెబుతున్నారు.
ఎస్సీలు ఎటువైపు...
ఇక దళిత ఓట్లు కూడా కీలకంగానే మారనున్నాయి. దళిత ఓటర్లు సహజంగా బీఎస్సీ వైపు మొగ్గుచూపడం ఆనవాయితీగా వస్తోంది. 2012 ఎన్నికల్లో మాయావతి దళిత ఓట్లను అత్యధిక శాతం సాధించుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఎస్సీ 25.9 శాతం ఓట్లను సాధించింది. అయితే 2014 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. దళితులు బీజేపీ వైపు మొగ్గు చూపారని లెక్కలు చెబుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో దళితులు 20 శాతం మంది కమలం పక్షాన నిలిచారు. దీంతో దళిత ఓట్లపై అటు మాయావతి, ఇటు బీజేపీ ఈ ఎన్నికల్లో ఆశలు పెట్టుకుంది. మాయావతి ప్రధానంగా ఈ ఓట్లనే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద యూపీలో పోరు నువ్వా? నేనా? అన్నట్లు సాగుతోంది.
- Tags
- ఉత్తరప్రదేశ్