కాంగ్రెస్ వ్యూహాలే కావాలనుకుంటున్న జగన్
రోల్ మాడల్ గా ఎంచుకోవడం అంటే అద్భుతంగా సక్సెస్ సాధించిన వారిని ఎవరైనా ఎంచుకుంటారు గానీ.. పతనం అయిపోయిన వ్యక్తి జీవితాలను ఆదర్శంగా తీసుకుంటారా? అయితే పతనం అయిన వారి జీవితాలనుంచి కూడా గ్రహించడానికి ఏదోటి ఉంటుందనుకునే వారూ ఉంటారు. అదే తరహాలో వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా కాస్త వెరైటీ ఆలోచనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్.. ఈలోగా పార్టీని పరిపుష్టం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా సర్వేలు, బృంద సర్వేల మీద అతిగా ఆధారపడే అలవాటు ఉన్న జగన్మోహన రెడ్డి.. అదే తీరులో ఇప్పుడు తమ పార్టీని ఉద్దరించుకునే ప్రయత్నాల్లో పడుతున్నారు. అయితే ట్విస్టు ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలనే జగన్మోహనరెడ్డి కూడా కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిషోర్ సేవలనే వాడుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ను కూడా బలోపేతం చేసుకోవాలనే వ్యూహంలో జగన్ ఉన్నారు.
ప్రశాంత్ కిషోర్ సేవలను తాము వాడుకోబోతున్న విషయాన్ని ఆయన ఇప్పటికే కొందరు పార్టీ నేతలతోనూ చర్చించినట్లుగా తెలుస్తోంది. యూపీ ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన బృందాలు మన రాష్ట్రానికి వచ్చి సర్వేలు నిర్వహిస్తాయని, వారు ఇచ్చే నివేదికల ఆధారంగా వైకాపాను ఎన్నికలకు సన్నద్ధం చేయాలని జగన్ అనుకుంటున్నారుట.
అయితే... కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త వచ్చి పనిచేస్తే.. వారికి లభించేది కూడా కాంగ్రెస్ వ్యూహాలే అవుతాయి కదా! అనేది ఒక సందేహం. ఇదిలా ఉండగా.. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా కంటె.. పొత్తుల లాబీయిస్టుగా గొప్ప పేరుంది. యూపీలో ఒకదశలో తనను కలవడానికి కూడా ఇష్టపడని అఖిలేష్ యాదవ్ ను ఆ తర్వాత కలవగలిగి, చివరికి కాంగ్రెస్ తో పొత్తులకు ఓకే చెప్పేంత వరకు పరిస్థితుల్ని సృష్టించగలిగాడంటే ఆయన చాణక్య తెలివితేటల్ని అర్థం చేసుకోవచ్చు. మరి ప్రశాంత్ కిషోర్ యూపీ ఎన్నికల తర్వాత ఏపీకి వచ్చి.. యూపీకి పఠించిన పొత్తుల మంత్రాన్నే ఇక్కడ కూడా పఠిస్తారా? అనగా అక్కడ కాంగ్రెస్ కు-ఎస్పీకి ముడిపెడుతున్నట్లే... ఇక్కడ కాంగ్రెస్కు- వైకాపాతో ముడిపెట్టేస్తారా? ఇది అనుమానం మాత్రమే!!