ఏపీ నూతన సీఎస్ ఎవరో?
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎవరిని నియమించాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి పదవీకాలం ఫిబ్రవరి 28వ తేదీతో ముగియనుంది. మార్చి 1వ తేదీన నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించాల్సి ఉంది. అయితే ఇప్పటికే చంద్రబాబు అజయ్ కల్లాం పేరును దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.
అజయ్ కల్లాం వైపు బాబు మొగ్గు....
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి 1983 బ్యాచ్ కు చెందిన అజయ్ కల్లాం, దినేష్ కుమార్, అనిల్ చంద్ర పునేత పోటీ పడుతున్నారు. వీరు ముగ్గురూ సీనియర్ అధికారులే. ముగ్గురూ చంద్రబాబు హయాంలో పనిచేసిన ఐఏఎస్ లే. అయితే చంద్రబాబు మాత్రం అజయ్ కల్లాం వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్ర ఎస్ పి టక్కర్ పదవీకాలాన్ని రెండు సార్లు పొడిగించారు. వాస్తవానికి టక్కర్ 2016 సెప్టంబరు మాసంలోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే రెండు సార్లు మూడు నెలల చొప్పున టక్కర్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. మరోసారి టక్కర్ పదవీకాలాన్ని పొడిగించే అవకాశమే లేదు. దీనికి తోడు టక్కర్ కూడా తాను పదవీ విరమణ చేసేందుకే ఇష్టపడుతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు తిరగలేనని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు టక్కర్ చెప్పారు కూడా. అయితే ఎన్నికల వరకూ ఒకే సీఎస్ ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అలా ఉంటేనే పాలన సజావుగా సాగుతుందని ముఖ్యమంత్రి విశ్వసిస్తున్నారు. 1980వ బ్యాచ్ కు చెందిన ఫరీదా ఉన్నారు. ఈయన సీనియర్ అయినా మార్చిలోనే పదవీ విరమణ చేస్తుండటంతో ఆయన కూడా సీఎస్ పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు. 1982 బ్యాచ్ కు చెందిన మరో సీనియర్ ఐఏఎస్ అధికారి పాణిగ్రాహి కూడా ఈ ఏడాది డిసెంబర్ లో రిటైర్ కానున్నారు. అందువల్ల ఈయన పేరుకూడా ముఖ్యమంత్రి జాబితాలో లేనట్లు తెలుస్తోంది. డిసెంబర్ లో మరో సీఎస్ ను వెతుక్కోవాలని, కేవలం పది నెలలకు సీఎస్ పదవి ఇవ్వడం కూడా చంద్రబాబుకు ఇష్టం లేదని చెబుతున్నారు. ఇక 1983 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారులు చాలా మందే ఉన్నారు. అజయ్ కల్లాం, దినేష్ కుమార్, భన్వర్ లాల్, అనిల్ చంద్ర పునేత, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై సీబీఐ కేసు ఉండటంతో ఆయనకు ఛాన్స్ లేదు. ఇక అజయ్ కల్లాం, దినేష్ కుమార్ ల మధ్యనే పోటీ ఉంది. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి, అధికారులను పరిగెత్తించే వారిపట్లే సీఎం మొగ్గు చూపే అవకాశముంది.
- Tags
- ఏపీ సీఎస్