ఏపీకి జగన్ అతిథి మాత్రమేనా?
వైఎస్సార్సీపీ అధినేత జగన్ విజయవాడ ఎందుకు వెళ్లలేకపోతున్నారు? కనీసం అక్కడ అద్దె ఇల్లు కూడా దొరకడం లేదా? పార్టీ కార్యాలయాన్ని కూడా ఎందుకు మార్చలేకపోతున్నారు. ఇవీ వైసీపీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్నలు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి మూడేళ్లు కావస్తున్నా వైసీపీ అధినేత జగన్ మాత్రం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కార్యాలయం నుంచే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పార్టీ సమావేశాలను నిర్వహించం కూడా లోటస్ పాండ్ లోనే. ఎవరైనా పార్టీలో చేరాలన్నా హైదరాబాద్ రావాల్సిందే. ఎందుకు జగన్ తన పార్టీని విజయవాడకు మార్చలేకపోతున్నారు? తన వ్యాపార కార్యాలయాలను వేగంగా బెజవాడకు మార్చేసిన జగన్ పార్టీని ఎందుకు తీసుకెళ్లలేక పోతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఏపీ రాజకీయాల్లో జగన్ గెస్ట్ పాత్ర పోషిస్తున్నారన్నవిమర్శలు కాస్త ఘాటుగానే విన్పిస్తున్నాయి. కాని జగన్ మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు.
కార్యక్రమాలు సరే...
వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత. నెలలో ఇరవై రోజులు ఏపీలోనే తిరుగుతున్నారు. ప్రజాసమస్యలపై ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. యువభేరి పేరిట ప్రజల చెంతకు వెళుతున్నారు. కాని కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేకుంటే ఎలా? అన్నది సొంత పార్టీ నుంచే తలెత్తుతున్న ప్రశ్న. జగన్ తీరును అధికార పార్టీ తనకు అనుకూలంగానే మార్చుకుంటోంది. ప్రత్యేక హోదా కోసం హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ చేరుకున్న జగన్ ను అక్కడే ఆపి వెనక్కు తిరిగి పంపారు. హైదరాబాద్ వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా అని నినదించడం కొంత ఎబ్బెట్టుగానే అన్పించింది. ఆంధ్రప్రదేశ్ లో కాలుమోపి ఆ మాట అనుంటే వేరేరకంగా ఉండేదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక అధికారపార్టీ కూడా వైఎస్ఆర్ పార్టీని పరాయిరాష్ట్ర పార్టీగానే చూస్తోంది. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ అరాచకాలు చేస్తామంటే ఊరుకునేది లేదని టీడీపీ నేతలు బహిరంగంగా జగన్ టీంను హెచ్చరించారు కూడా. అలాంటి పరిస్థితిని జగన్ చేజేతులా తెచ్చుకుంటున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
అద్దె ఇల్లు కూడా దొరకడం లేదా...?
ఇటీవల అమరావతి రైతుల పరామర్శకు జగన్ వచ్చినప్పుడు తాను త్వరలోనే సొంత ఇంటిలోకి వస్తానని చెప్పారు. సొంత ఇల్లు కట్టుకుని గాని జగన్ విజయవాడ రారన్న విమర్శలు వెంటనే వచ్చేశాయి. సొంత ఇల్లుదేనికి? కనీసం బెజవాడలో జగన్ కు అద్దె ఇల్లు దొరకడం లేదా? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత అందుబాటులో ఉంటేనే ప్రజలు ఆయన చెంతకు వచ్చే అవకాశం ఉంటుంది. పొరుగు రాష్ట్రం వెళ్లి తమ సమస్యలను విన్పించడానికి ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే మన రాష్ట్రం అనే సెంటిమెంట్ బాధితులను కట్టిపడేస్తుంది కాబట్టి. కాని జగన్ మూడేళ్లవుతున్నా ఎందుకు బెజవాడకు షిఫ్ట్ అవ్వలేక పోతున్నారో అర్ధం కావడం లేదని వైసీపీ సీనియర్ నేత ఒకరు అంటున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి సమస్యలపై స్పందించడం ఎంతవరకూ సబబన్న ప్రశ్న జగన్ కు రోజూ ఎదురవుతూనే ఉంది. జగన్ విజయవాడకు మకాం మార్చనంతవరకూ అక్కడి ప్రజలు ఆయనను అతిధిగానే చూస్తారని ఇటీవల ఒక సీనియర్ పాత్రికేయుడు అన్న మాటలో వాస్తవం లేకపోలేదు. ఇప్పటికైనా జగన్ తన నివాసాన్ని ఏపీ రాజధానికి మార్చి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు.
- Tags
- వైఎస్ జగన్