ఎవడు కొడితే...మ్యాచ్ విన్ అవుద్దో....

ధోనీ....ఈ పేరు వింటేనే క్రికెట్ అభిమానుల రోమాలు నిక్కబొడుకుంటాయి. మహేంద్రుడు క్రీజ్ లో ఉంటే అభిమానులు అందరూ ఉత్కంఠతో మునికాళ్ల మీద నిల్చోవాల్సిందే. హెలికాప్టర్ షాట్లకు ధోని పెట్టింది పేరు. ధోనీ క్రీజులో నిలదొక్కుకున్నాడంటే చాలు మ్యాచ్ మన పరమైనట్లే. బాల్స్ తక్కువ...పరుగులు ఎక్కువ ఉన్నా పెద్ద ఫరక్కేం పడక్కర్లేదు. ఎందుకంటే కూల్ గా ఆడుతూ సిక్స్ లు మీద సిక్స్ లు బాదే జార్ఘండ్ డైనమెట్ మైదానంలో ఉంది కాబట్టి. ప్రత్యర్థి....ఒక ఓవర్....ఆరు పరుగులు చేయాలి. ప్రత్యర్థి జట్టుకే విజయావకాశాలు ఎక్కువ. కాని కెప్టెన్ ధోనీ స్టేడియంలో చేస్తున్న సైగలు.... జట్టుకు ఇస్తున్న సూచనలు చూసి భారత్ అభిమానుల్లో ఎదో ఒక ఆశ. విజయం మనదేనని....కాని ప్రత్యర్ధి విజయానికి చేరువలో ఉన్నాడు. అంతటా టెన్షన్. ...మైదానంలో ఈ పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురయ్యాయి. స్టేడియంలోనూ... ప్రత్యక్ష ప్రసారాల్లోనూ కోట్లాది మంది ఈ టెన్షన్ అనుభవించిన వారే. ప్రత్యర్ధి ఆస్ట్రేలియా కావచ్చు. వెస్ట్ ఇండీస్.. శ్రీలంక ఏదైనా కావచ్చు. కెప్టెన్ కూల్ ఈ పరిస్థితుల నుంచి ఎన్నోసార్లు భారత్ కు విజయాన్ని అందించి అభిమానులను భావోద్వేగానికి గురి చేశారు. అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇది ధోనీపై యావత్ క్రీడాలోకం మనస్సులో మాట. అటువంటి ధోనీ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ లలో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే టెస్ట్ ల నుంచి వైదొలగిలిన ధోని ఇకపై వన్డే, టీ20 ల్లో కూడా కెప్టెన్ గా కన్పించడు.
ఎన్నో మైలు రాళ్లు.....
బుధవారం రాత్రి క్రికెట్ అభిమానులకు చేదువార్త. డిన్నర్ టైంలో డైనమెట్ పేలింది. ధోని ఇక కెప్టెన్ గా ఏ ఫార్మాట్ లో కన్పించడన్న విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. నిత్యం నవ్వుతూ జట్టులో ప్రతి సభ్యుడికీ సూచనలు ఇచ్చే ధోనీ భారత్ కు తిరుగులేని ఎన్నో విజయాలనందించారు. యువజట్టు ఆరితేరింది ధోనీ సారధ్యంలోనే అన్నది సుస్పష్టం. ధోని కెప్టెన్సీలో ఎన్నో మైలురాళ్లు. ఎన్నో కప్ లు..మరెన్నో ట్రోఫీలు.. ఇంకెన్నో టైటిళ్లు. ఆఖరు బంతితో విజయాన్నందుకున్పప్పడు కూడా ధోనీ ఉద్నిగ్నానికి లోను కాడు. చాలా ప్రశాంతంగా కప్పు అందుకుంటాడు. గంగూలీ, కోహ్లీలాగా విజయాన్ని ధోని ఆస్వాదించడని క్రికెట్ అభిమానులు భావిస్తారు. కాని డ్రెస్సింగ్ రూంలో మాత్రం ధోని విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని సహచర ఆటగాళ్లు చెబుతారు.
ధోనికి ముందు కీపర్ ఎవరో చెప్పండి?
ధోని 2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్నాడు. మొత్తం మూడు ఫార్మాట్లలో 331 పైగా మ్యాచ్ లకు సారధ్యం వహించిన ధోనీ తన కెరీర్ లో ఎన్నో విజయాలను కైవసం చేసుకున్నాడు. క్రికెట్ పటంలో భారత్ ను అగ్రస్థానంలో నిలిపాడు. క్రికెట్ అభిమానులు ధోనికి ముందున్న వికెట్ కీపర్ ఎవరంటే టక్కున చెప్పరేలేమో. వికెట్ కీపర్ గా అంతగా మరిపించాడు ధోనీ. ధోనీ చేసిన రనౌట్లు మళ్లీ మళ్లీ చూడాలనిపించేవే. సెకన్ల సమయంలో ప్రత్యర్ధులు ధోనీ చేతిలో చిక్కిపోయారు. ఒక్క వన్డే, టీ 20ల్లో 114 స్టంపింగ్ లు ఉన్నాయంటే వికెట్ కీపర్ గా ధోనీ కదలికలను ఇట్టే తెలుసుకోవచ్చు. బంతి కంటే వేగంగా కాళ్లను, చేతులను కదుపుతాడనే ప్రశంసను ధోనీ ఎన్నోసార్లు పొందాడు. వికెట్లను చూడకుండానే వెనక్కు తిరిగి బంతిని వికెట్లపైకి విసరడం ఒక్క ధోని కే సాధ్యం. కాళ్లు కండరాలు పీకుతున్నా...చూపంతా దూసుకొచ్చే బంతిపైనే. ఒక కన్ను బంతిపైనా...మరొక కన్ను వికెట్లు...బ్యాట్స్ మెన్ పాదాలపైనే.. ధోనీ స్టంపింగ్ లపై ఎంత చెప్పినా తక్కువే. అది చూస్తే కాని మజా రాదు. అక్షరాలు కూడా వర్ణించ లేనంతగా ఉంటాయి ధోని స్టంపింగ్ లు. క్రికెట్ కామెంటేటర్లకు నోటినిండా పనే. ధోనీ కెరీర్ లో మొత్తం 283 వన్డేలాడి 9110 పరుగులు చేశాడు. వీటిలో 9 సెంచరీలు, 61 ఆఫ్ సెంచరీలున్నాయి. టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫి ధోని సారధ్యంలోనే భారత్ పరమయ్యాయి. 2007లో ధోని సారధ్యంలో భారత్ తొలి టీ20 ప్రపంచ కప్ ను అందుకుంది. 2011లో ప్రపంచ కప్ ను అందుకున్నాడు ధోని. ఈ మ్యాచ్ లో శ్రీలంకతో ఫైనల్ జరిగింది. ధోని సిక్స్ బాది భారత్ కు విజయాన్ని అందించడం ఏ క్రికెట్ అభిమాని మర్చిపోలేడు. అలాంటి ధోని అందించిన యావత్ భారత్ ఎన్నడూ మర్చిపోలేదు...మర్చిపోదు కూడా. అలాగే క్రికెట్ ఆట ఉన్నంత వరకూ.....వికెట్లపై బంతులు పడుతున్నంత వరకూ ప్రతి క్రికెట్ అభిమానికి ధోని గుర్తుకు వస్తూనే ఉంటాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ నీ సేవలను భారత్ ఎన్నడూ మర్చిపోదు. భారత్ కు ఇన్ని విజయాలందించిన నీకు మేం ఏమిచ్చి రుణం తీర్చుకోం.....అంటున్నారు అభిమానులు. ఎవడు కొడితే...మ్యాచ్ గెలుస్తుందో....వాడే ధోని...సలాం..ధోని..
- Tags
- ధోని
