ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఆ ఎస్పీ ఎవరు?
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఇంటి దొంగలున్నారా? డిపార్ట్ మెంట్ వ్యక్తులే ఎర్రచందనాన్ని తరలిస్తున్నారా? అవుననే అన్నారు పోలీసు అధికారి కాంతారావు. అయితే కాంతారావు వ్యాఖ్యలను ఏపీ డీజీపీ తప్పుపట్టారు. ఆయన నుంచి వివరణ కోరతామంటున్నారు. ఒక టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలకు విలువలేదా? అని అంటున్నారు కిందిస్థాయి పోలీలసులు. బయట వ్యక్తులపై ఆరోపణలు వస్తే వెంటనే విచారణ చేపట్టే పోలీసులు తీరా తమ శాఖలోకి వచ్చేసరికి ఆరోపణలు చేసిన వారినే వివరణ కోరతామంటున్నారు. ఇదెక్కడి చోద్యమంటున్నారు మేధావులు.
ఎస్పీ వాహనంలో దుంగలు...
ఆంధ్రప్రదేశ్ లో ఎర్రచందనానికి కొదవలేదు. స్మగ్లింగ్ జోరుగా జరుగుతూనే ఉంటుంది. రోజు టన్నుల కొద్దీ ఎర్రచందనాన్ని అటవీశాఖ పట్టుకుంటూనే ఉంటుంది. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను నియమించింది. దీనికి డీఐజీ స్థాయి అధికారిని నియమించింది. డ్రోన్ కెమెరాలనూ ఏర్పాటు చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికడతామని ప్రకటించింది. ఎర్రచందనం అక్రమరవాణా కోసం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కు డీఐజీ గా కాంతారావును నియమించింది. ఈయన ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతుందని ఆవేదన చెందారు. రహస్యంగా రాష్ట్ర సరిహద్దులు దాటుతుందన్నారు. ఒక ఎస్పీ స్థాయి అధికారి తన వాహనంలో ఎర్రచందనం దుంగలను తీసుకెళ్తుండగా పట్టుకున్నామని, అయితే ఆ తప్పును కిందిస్థాయి సిబ్బందిపై నెట్టివేశారని కాంతారావు గోడును వెళ్లగక్కారు. అంతేకాదు ఈ కేసు విచారణలో అడుగడుగునా అడ్డంకులను...అవరోధాలనే ఎదుర్కొంటున్నానని చెప్పారు.
పోలీసు బాస్ సీరియస్...
కాంతారావు వ్యాఖ్యలపై పోలీస్ బాస్ సీరియస్ అయ్యారు. డీఐజీ స్థాయి అధికారి అలాంటి ప్రకటన చేయకూడదని చెప్పారు. దీనికి సంబంధించి కాంతారావు వివరణ కోరతామన్నారు. మీడియా ఎదుట బహిరంగంగా మాట్లాడటం సరికాదన్నారు డీజీపీ సాంబశివరావు. ఇంతకీ కాంతారావు చేసింది తప్పే. మరి ఆ ఎస్పీ కేసు ఏమైనట్లు? పోలీసు ఉన్నతాధికారులకు ఒక న్యాయం? సామాన్యులకు ఒక న్యాయమా? సాక్షాత్తూ పోలీసు అధికారి చేసిన ఆరోపణలకే విలువలేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డీజీపీ సాంబశివరావు తొలుత ఎర్రచందనం దుంగలతో పట్టుబడ్డ ఎస్పీపై విచారణ జరిపితే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. అయితే డీజీపీ మాత్రం చివర్లో కాంతారావుకు మంచి అధికారిగా కితాబిచ్చారు.
- Tags
- ఏపీ పోలీస్