ఎన్టీఆర్ సినిమాలో అన్నీ ఉంటాయా?

నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. నిమ్మకూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ఈ ప్రకటన చేశారు. ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్టీఆర్ సన్నిహితులతో ఈ విషయం చర్చిస్తున్నట్లు కూడా చెప్పారు. ఎన్టీఆర్ చిన్నతనంలో ఉన్న సంఘటనలను కూడా చిత్రంలో ఉంటాయన్న బాలయ్య ఎన్టీఆర్ పాత్రను తానే పోషిస్తున్నట్లు తెలిపారు.
రాజకీయాలకూ చోటుంటుందా?
బాలకృష్ణ ప్రకటనతో ఎన్టీఆర్ పాత్ర బాలకృష్ణ చేస్తారు సరే. చంద్రబాబు పాత్ర కూడా ఇందులో ఉంటుందా? కేవలం నట జీవితాన్నే చిత్రంలో చూపుతారా? రాజకీయాలను కూడా చేరుస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. రాజకీయాల విషయాలను కూడా చేరిస్తే చంద్రబాబు వెన్నుపోటు సీన్ ఎలా ఉంటుందో? అన్న సెటైర్లు సోషల్ మీడియాలో వెంటనే దర్శనమిస్తున్నాయి. లక్ష్మీపార్వతి క్యారక్టెర్ పైన కూడా పోస్టులు కన్పిస్తున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ఒక సంచలనమే. అలాగే రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. ఏళ్ల తరబడి పాలిస్తున్న కాంగ్రెస్ ను కూకటి వేళ్లతో రాష్ట్రం నుంచి ఎన్టీఆర్ తరిమేయగలిగారు. కాని ఆయన చివరి క్షణాలు విషాదమనే చెప్పకతప్పదు. ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో అన్నం పెట్టే దిక్కు లేక అలమటించిపోయారన్న కథనాలు కూడా వచ్చాయి. అందుకోసమే లక్ష్మీపార్వతిని పెళ్లాడినట్లు చెబుతారు. ఇక వైశ్రాయ్ వ్యవహారం, ఎన్టీఆర్ ను పదవినుంచి గద్దె దించడం వంటి విషయాలను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరచిపోరు. అలాంటి సన్నివేశాలు బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలో ఉంటాయా? ఉండవా? అన్న కామెంట్లు నెటిజెన్లు తెగ పోస్టులు చేసేస్తున్నారు. జీవిత కథ అంటే అన్నీ ఉండాలి కదా? అన్న ప్రశ్నలూ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి.
- Tags
- ఎన్టీఆర్ సినిమా