ఉత్తమ్ ‘గడ్డం’ వెనుక కధ ఇదే?

తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. దీనికి కారణాలేంటి? ఓ సర్వే రిపోర్ట్ తమ పార్టీకి పూర్తి అనుకూలంగా రావడమే. అందుకే ఉత్తమ్ కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచేంత వరకూ గడ్డం గీయబోనని శపథం చేయడం. ఈ శపధం వెనుక సర్వే ఫలితాలే కారణమంటున్నారు కాంగ్రెస్ నేతలు. 2019 ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ధీమాగా చెబుతున్నారు.
మైండ్ గేమ్ అనుకున్నారు...
నిన్నమొన్నటి వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే మైండ్ గేమ్ ఆడుతున్నారేమో అనిపించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయమంటే ఆ ధీమా ప్రతి నేతకూ ఉండాల్సిందేనని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపడానికేమోనని కూడా అనుకోవాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్ రాష్ట్రంలో గెలిచేంత వరకూ గడ్డం గీయనని శపధం చేస్తే మాత్రం కొంత అనుమానం వచ్చింది. ఇంతటి శపథానికి ఉత్తమ్ ఎందుకు పూనుకున్నారు అనుకున్నారు అంతా. కేసీఆర్ లాంటి వ్యూహకర్త బరిలో ఉండగా కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని సొంత పార్టీల నుంచే వ్యాఖ్యలు విన్పించాయి.
అనుకూలంగా సర్వే రిపోర్ట్ లు...
అయితే ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపించిన సర్వేలేనని తెలిసింది. ముంబయి కి చెందిన ఒక ప్రముఖ సర్వే సంస్థతో ఉత్తమ్ రెండున్నరేళ్లు కేసీఆర్ పాలన పూర్తయిన తర్వాత సర్వే చేయించారట. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని సర్వే రిపోర్ట్ లో వచ్చింది. ప్రస్తుతం చేసిన సర్వే ప్రకారం కాంగ్రెస్ 70 సీట్లలో ముందంజలో ఉందని తేలింది. 20 సీట్లలో పోటాపోటీగా టీఆర్ఎస్ కు దీటుగా ఉందట. 29 సీట్లలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడం కష్టమేనని సర్వే నివేదికలు చెప్పాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిందని చెబుతున్నారు. మిగిలిన సీట్లలో కూడా పార్టీని బలోపేతం చేసుకుంటే 2019 ఎన్నికల్లో తమదే విజయమని భావిస్తున్నారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘గడ్డం’ శపథం చేశారంటున్నారు.
కొసమెరుపు: ‘ప్రజలనాడి క్షణక్షణానికీ మారుతుంది. కేసీఆర్ వేసే వ్యూహాలకు దీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా వేయాలి. సర్వేల్లో ఫలితాలు అనుకూలంగా వచ్చినంత మాత్రాన సంబరపడి పోకూడదు. ఎన్నికల మూడ్ ను కేసీఆర్ క్యాష్ చేసేసుకుంటారు. జాగ్రత్త’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ తో చెప్పారట.