ఇలా ఆచరణసాధ్యం కాని దీక్షలేల?
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు అనేది.. పరిపాలన పరమైన అవసరం అనే దగ్గరినుంచి ఒక రాజకీయ గిమ్మిక్ అనే వరకు వచ్చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత 27 జిల్లాలుగా విడగొట్టి.. ఆ తర్వాత వెల్లువెత్తిన జనాభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని మరో నాలుగు కూడా జతకలపడానికి అంగీకరించారు. అక్కడితో వ్యవహారం ముగిసిందనిపించారు. అయితే.. అంతా ముగిశాక కొందరు నాయకులు ఇంకా కొత్త జిల్లా డిమాండ్లను వినిపిస్తూ ఉద్యమాలు, ఆందోళనల పేరెత్తడం చిత్రంగా ఉంది.
ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో సున్నం రాజయ్య తాజాగా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. భద్రాచలం కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలనేది ఆయన కోరిక. ఇప్పుడు కేంద్రం భద్రాచలం కాకపోయినా, ఆ పేరు మీదనే జిల్లా ఏర్పడబోతున్నది. అయితే ఆయన భద్రాచలం కేంద్రంగా జిల్లా కావాలని అంటున్నారు.
పైగా సున్నం రాజయ్య తన డిమాండ్ల చిట్టాను అక్కడితో ఆపడం లేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ముంపు ప్రాంతాల కిందికి వచ్చే భాగాలుగా.. ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో కలిపేసిన రెండు మండలాలను కూడా తిరిగి తెలంగాణలోకి తేవాలంటున్నారు. రెండు మండలాలు, మరికొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి తెలంగాణలోకి తెచ్చి, ఆ తర్వాత.. వాటితో కలిపి భద్రాచలం జిల్లాను ఏర్పాటు చేయాలట.
మండలాలను ఏపీలో కలపడం అనేది పునర్విభజన చట్టం పర్యవసానంగా రాజ్యాంగసవరణ ద్వారా జరిగిన ప్రక్రియ. ఆ మండలాలను మళ్లీ వెనక్కు తేవడం అనేది అనూహ్యం, అసాధ్యమైన సంగతి అనేది అందరికీ తెలుసు. అయితే ఇలాంటి ఆచరణ సాధ్యం కాని డిమాండ్ తో దీక్షకు దిగడం వల్ల ఏదో నాలుగురోజులు హైడ్రామా నడుస్తుంది తప్ప మరో లాభం ఉండదని జనం అనుకుంటున్నారు.