ఇంకా ఏపీకి కొత్త అధ్యక్షుడిని పెట్టే ధైర్యం రాలేదా?
భారతీయ జనతా పార్టీకి చెందిన జాతీయ స్థాయి నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ.. 2019 ఎన్నికల నాటికి తమ పార్టీ రాష్ట్రంలో మరింతగా బలోపేతం కావాలని, రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయంగా ఎదగాలని అంటూ ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా పోటీచేసే స్థాయికి పార్టీ వస్తుందని పదేపదే చెబుతూ ఉంటారు. ఇన్ని మాటలు చెబుతున్నప్పటికీ.. పార్టీకి నూతన రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే విషయంలో భాజపా నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉండడం అనేది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తాజాగా రెండు రాష్ట్రాలకు అధ్యక్షలను నియమించింది. దిల్లీకి ఎంపీ మనోజ్ తివారీని, బీహార్ కు ఎంపీ నిత్యానందరాయ్ ను కొత్త అధ్యక్షులు చేశారు. ఈ రెండు రాష్ట్రాల విషయంలో కూడా ప్రస్తుతం ఉన్న అధ్యక్షులకు పదవీకాలం ముగిసి కొంత కాలం గడుస్తున్నా కొత్తవారి ఎంపిక ఇన్నాళ్లకు జరిగింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పదవీకాలం చాన్నాళ్లకిందటే పూర్తయిపోయింది. కొత్తవారి నియామకం విషయంలో మాత్రం అమిత్ షా మీనమేషాలు లెక్కిస్తున్నారు.
చంద్రబాబును , ఆయన ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో తూర్పారపడుతూ ఉండే సోము వీర్రాజు, పురందేశ్వరి లాంటి వారి పేర్లను భాజపా నాయకత్వం రాష్ట్ర అధ్యక్ష స్థానానికి కీలకంగా పరిశీలిస్తున్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు తన ఇన్ఫ్లుయెన్స్ తో సోము వీర్రాజు పేరు ప్రకటించకుండా అడ్డం పడ్డారనే పుకార్లు కూడా ఉన్నాయి. ఒకవేళ చంద్రబాబును నొప్పించకుండా ఉండడమే అధిష్టానం ఉద్దేశం అయితే.. కంభంపాటి హరిబాబుకే రెండోసారి పగ్గాలు ఇవ్వొచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఏది ఏమైనప్పటికీ.. ఏపీకి నూతన అధ్యక్షుడిని నియమించి.. పార్టీని క్రియాశీలంగా ముందుకు తీసుకెళ్లే విషయంపై భాజపా సీరియస్గా దృష్టిపెట్టడం లేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఏపీ లో పార్టీని బలోపేతం చేసే విషయంలో భాజపా మాటలు చెప్పడం తప్ప, ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నది.. ఆ పార్టీ నాయకులకే అర్థం కాని సంగతి.