Sun Oct 06 2024 00:48:41 GMT+0000 (Coordinated Universal Time)
ఆస్తుల పంపకం కొలిక్కి వచ్చేనా?
ఉన్నత విద్యా మండలి వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పదో షెడ్యూల్లో ఉన్న అన్ని సంస్థలకు వర్తించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. విభజన జరిగి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఇంకా ఆస్తులు., అప్పులు పంపిణీ కొలిక్కి రాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతోందని ప్రభుత్వం భావిస్తోంది.ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ ప్రాంతానికేనంటోన్న తెలంగాణ వైఖరి విభజన చట్టానికి విరుద్ధమని ఏపీ వాదిస్తోంది. జనాభా ప్రకారం 58:42 నిష్పత్తిలో అన్ని సంస్థల్ని రెండు రాష్ట్రాలకు పంచాలని డిమాండ్ చేస్తోంది. పదో షెడ్యూల్లోని సంస్థల విభజనపై కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి జైదీప్ గోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి లేఖను పంపింది. జనవరి 13న పదో షెడ్యూల్ సంస్థల విభజనపై ఢిల్లీలో జరిగిన సమావేశం అర్ధాంతరంగా ముగియడంతో రెండు రాష్ట్రాల వాదనలు లిఖిత పూర్వకంగా పంపాలని కేంద్ర ఆదేశించింది. ఈ మేరకు 28పేజీల నివేదికను ఏపీ ప్రభుత్వం గత వారం పంపింది.
జనాభా ప్రాతిపదికనే...
పదో షెడ్యూల్ సంస్థలపై తెలంగాణ చేసిన వాదనలన్నింటిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చినందున ఆస్తులను జనాభా నిష్పత్తిలో పంచాలని ఏపీ డిమాండ్ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన సంస్థల ఆస్తులు., అప్పులు., బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు విభజన చట్టానికి అనుగుణంగా పంచాలని కోరింది. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేసే బాధ్యత రెండు రాష్ట్రాలతో పాటు కేంద్రానికి కూడా ఉందన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత సెక్షన్ 47., 66 ప్రకారం కేంద్రానిదేనని., ఆస్తుల్లో తెలంగాణకు వాటా కల్పించే అధికారం ఏపీ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. మరోవైపు పదో షెడ్యూల్ లోని ఆస్తుల విభజన ., ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన., హైకోర్టు విభజన., సెక్రటేరియెట్., సచివాలయ భవనాల అప్పగింత., ఉద్యోగుల పంపిణీ అంశాలపై రెండు రాష్ట్రాలతో చర్చించేందుకు గవర్నర్ చొరవ చూపనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్క్రత సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఉన్నతాధికారులతో గవర్నర్ సమావేశాన్ని బుధవారం నిర్వహించనున్నారు.ఏపీ నుంచి యనమల రామకృష్ణుడు., అచ్చన్నాయుడు., కాల్వ శ్రీనివాసులు., తెలంగాణ నుంచి హరీష్రావు., జగదీష్ రెడ్డి., మాజీ ఎంపీ వివేక్లతో కూడిన కమిటీ గవర్నర్తో జరిగే చర్చల్లో పాల్గొననుంది. ఇరు రాష్ట్రాల బృందాలతో జరిగే చర్చల్లో సమస్య కొలిక్కి రాకుంటే ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని గవర్నర్ భావిస్తున్నారు.
Next Story