అమ్మ వారసత్వం అగ్గిలా రాజుకుంటోంది!!
![అమ్మ వారసత్వం అగ్గిలా రాజుకుంటోంది!! అమ్మ వారసత్వం అగ్గిలా రాజుకుంటోంది!!](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2016/10/jaya4.jpg)
తమిళనాట రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. పురట్చితలైవి జయలలిత కు అచ్చమైన వారసత్వం గురించి అధికారిక ప్రకటన జరగకపోయినా.. దాదాపుగా ఆ స్థాయిలో అధికార బదలాయింపు మాత్రం జరిగిపోయింది. ముఖ్యమంత్రి స్థాయిలో కేబినెట్ భేటీలకు అధ్యక్షత వహించడం, జయలలిత చూసిన శాఖలన్నిటినీ నిర్వహించడం ఇప్పుడు పన్నీర్ సెల్వం చేతిలో ఉన్నదని అందరికీ తెలిసిన సంగతే. అయితే అసలు జయలలిత సలహా మేరకు పన్నీర్ సెల్వంకు అధికారాలు బదలాయిస్తున్నట్లు రాజ్‌భవన్ చేసిన ప్రకటన మీదనే ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అసలు గవర్నర్‌కు జయలలిత ’ఎలా?‘ సలహా ఇచ్చారు అనే అనుమానాలు డీఎంకే నేతలు లేవనెత్తుతున్నారు.
గవర్నర్ స్వయంగా వివరణ ఇచ్చే వరకు దీనిపై అనుమానాలు అలాగే ఉంటాయంటూ డీఎంకే అధినేత కరుణానిధి అంటున్నారు. సెల్వంకు అధికారాలు ఇవ్వమని కోరుతూ జయలలిత సంతకం చేశారా? మరో రకంగా కోరారా? అనే అనుమానం జనంలో ఉన్నదని వారంటున్నారు. జయలలిత ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఇప్పటిదాకా అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం ఒక పెద్ద తప్పిదంగా వారిని వెన్నాడుతోంది. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది.
అదే సమయంలో.. కొన్ని రోజుల కిందట జయలలిత సంతకం ఫోర్జరీతో.. అధికారల బదలాయింపు గురించి లేఖ వచ్చే అవకాశం ఉన్నదంటూ.. ఒకప్పట్లో జయలలితకు సన్నిహితురాలు అయిన బహిష్కృత నాయకురాలు శశికళ పుష్ప చేసిన ఆరోపణలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. జయలలిత పేరిట నకిలీ ఉత్తరం బనాయించారా అనే అనుమానం కలుగుతోంది.
ఇలాంటి సమయంలో భాజపా అగ్ర నాయకులు అమిత్ షా, అరుణ్ జైట్లీ పరామర్శకు రావడం అరగంట సేపు వైద్యులతో మాట్లాడి అసలు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది. ఇలాంటి అనేక పరిణామాలు రకరకాల సందేహాలు లేవనెత్తుతుండగా... అమ్మ వారసత్వం తమిళనాట అగ్నిలా రాజుకుంటోంది.