అందుకు జై కొట్టారు.. ఇందుకు ఛీ అంటున్నారు
దేశంలో ఇప్పుడు ప్రజలకు వేరే అంశాలేమీ లేనట్లుగా రెండే విషయాలు చర్చించుకుంటున్నారు. ఒకటి- నోట్ల రద్దు తదనంతర పరిణామాలు రెండు – బంగారం మీద ఆంక్షలు. ఈ రెండు నిర్ణయాలను సహజంగానే భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు కేంద్ర మంత్రులు గట్టిగానే సమర్థించుకుంటున్నారు. ఒకటో విషయంలో ప్రజల కష్టాలు, రెండో విషయంలో ప్రజల భయాలు ఎలా ఉన్నప్పటికీ, వారి తీరులో మాత్రం మార్పు లేదు.
అయితే ఇక్కడ ఒక విషయాన్ని కీలకంగా గమనించాల్సి ఉంది. ఈ రెండు అంశాల వారీగా పరికిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి ఇతర పార్టీలనుంచి మద్దతు సమానంగా దక్కడం లేదని చెప్పాలి. ఎన్డీయేలో భాగస్వామి అయిన తెలుగుదేశాన్నే తీసుకుంటే.. నోట్ల రద్దు వ్యవహారాన్ని వారు అడ్డగోలుగా సమర్థించారు. ఒక రకంగా చెప్పాలంటే.. తాము భాజపాలో భాగమే అయినట్లుగా భుజాన వేసుకుని మోసారు. ఆ నిర్ణయం విజయవంతం కావడానికి తాము పడగలిగిన కష్టాలన్నీ పడ్డారు.
అయితే బంగారం ఆంక్షల విషయానికి వచ్చేసరికి వారి వైఖరి పూర్తి భిన్నంగా ఉంది. తెలుగుదేశం నాయకులు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళలను ఆక్రోశానికి గురిచేస్తే మోదీ సర్కారు పతనం కాకుండా తప్పదని హెచ్చరిస్తున్నారు. అదే తెలుగుదేశం.. అదే ఎన్డీయే లో భాగస్వామి పార్టీ.. కానీ నోట్ల విషయంలో ఒక రకంగా, బంగారం విషయంలో ఒక రకంగా కేంద్ర నిర్ణయాల పట్ల వారి స్పందన ఉంటోంది.
ఈ తేడాను మోదీ సర్కారు కూడా గమనిస్తే.. వారికే శ్రేయస్కరం. ఎందుకంటే.. మిత్రపక్షాలే తమకు మద్దతివ్వడానికి భయపడుతున్నాయంటే.. ప్రజావ్యతిరేకత ఎంతగా ఉన్నదో వారు గుర్తించాలి. ఒక దానికి జై కొడుతూ.. మరో దానికి ఛీ అంటున్నారంటే.. ఆ తేడా ఎందుకు వచ్చిందో.. లోపం ఎక్కడ ఉన్నదో తెలుసుకుని దిద్దుకోవాలి.