Sun Jul 03 2022 08:33:50 GMT+0000 (Coordinated Universal Time)
బాహుబలి 2 జక్కన్నకు బాగా సులువుగా ఉందంట

సాధారణంగా ఒక చిత్రం అమితమైన ప్రేక్షకాదరణ సంపాదిస్తే ఆ చిత్రానికి కొనసాగింపుగా మరో భాగం తీయాలనే ఆలోచిస్తుంటారు దర్శక నిర్మాతలు. ఆలా విజయవంతమైన చిత్రాలకు కొనసాగింపుగా వచ్చే చిత్రాల పై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఏర్పడతాయి. కానీ ఈ సూత్రం బాహుబలి చిత్రానికి వర్తించదు. బాహుబలి ది బిగినింగ్ కే విపరీతమైన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలకి ముందే పెరిగిపోయాయి. ఆ చిత్రం అందరి అంచనాలను చాలా సులభదాయకంగా అందుకున్న సంగతి విదితమే. ఆ చిత్రం లోని పాత్రలు, కథా పరిచయం బాహుబలి ది కంక్లూషన్ చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఆతృతగా ఎదురు చూసేలా చేశాయి.
మరి ఈ భారీ అంచనాలను అందుకోవాలంటే సీక్వెల్ ను విజవల్ వండర్ గా తీర్చిదిద్దాలి. దర్శకుడి పై అదనపు బరువు బాధ్యతలు పెంచుతాయి ఈ అంచనాలు. కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం ఆ ఒత్తిడి ఏమి లేకుండా పనిచేసుకుంటున్నాడంట. "బాహుబలి ది బిగినింగ్ చేస్తున్నప్పుడు మంచి సబ్జెక్టు అని పూర్తి విశ్వాసంతో చిత్ర బృందం అంతా పనిచేశాం. కానీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే భయం మాత్రం వెంటాడుతూ ఉండేది. అయితే ఆ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు. వారికి ఆ పాత్రలు కథా నేపధ్యం పూర్తిగా అవగాహన వుంది. ఇక నేను కథా పరిచయానికి, పాత్రలలో ప్రేక్షకులని లీనం చెయ్యటానికి శ్రమించనవసరం లేదు. కాబట్టి బాహుబలి ది కంక్లూషన్ కి నా పని చాలా సులభంగా అవుతుంది." అని వివరించాడు జక్కన్న.
బాహుబలి ది కంక్లూషన్ ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలు తరువాతి రెండు నెలలో పూర్తి చేసుకుని 2017 వేసవి కి ప్రేక్షకులను పలకరించటానికి సన్నద్ధమవుతుంది.
Next Story