జగన్ కు ఆ ప్రమాదం..?
కేంద్రంలోని బీజేపీకి ఆశ మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. దేశం మొత్తాన్ని ఏలాలని బీజేపీ పెద్ద పెద్ద ఎత్తులే వేస్తోంది. ఏపీలో అధికారం అసాధ్యం అనుకున్న బీజేపీకి ఇపుడు [more]
కేంద్రంలోని బీజేపీకి ఆశ మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. దేశం మొత్తాన్ని ఏలాలని బీజేపీ పెద్ద పెద్ద ఎత్తులే వేస్తోంది. ఏపీలో అధికారం అసాధ్యం అనుకున్న బీజేపీకి ఇపుడు [more]

కేంద్రంలోని బీజేపీకి ఆశ మరీ ఎక్కువగా ఉన్నట్లుంది. దేశం మొత్తాన్ని ఏలాలని బీజేపీ పెద్ద పెద్ద ఎత్తులే వేస్తోంది. ఏపీలో అధికారం అసాధ్యం అనుకున్న బీజేపీకి ఇపుడు జగన్ అధికారంలోకి రావడంతో పని సులువు అయినట్లుగా ఉంది. ఎందుకంటే జగన్ కి రాజకీయ వ్యూహాలు పెద్దగా తెలియవు. ఆయనది ముక్కుసూటి మనస్తత్వం. పట్టుదలకు, మొండితనానికి మధ్య ఉన్న సన్నని గీత జగన్ విషయంలో ఎపుడూ అటూ ఇటుగా ఉంటుంది. ఇక జగన్ అనుకున్నది చేయడానికి ఎంతదాకానైనా వెళ్తారు. అందువల్ల కోరి వ్యతిరేకత తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జగన్ కి ఓ విషయం మేలు చేసేదిగా ఉందని చెప్పాలి. అదే రాటుదేలిన రాజకీయ అనుభవం. రాజకీయల్లోకి వస్తూనే జగన్ తలపండిన కాంగ్రెస్ ని ఎదుర్కోవడంతో ఆ ఎపిసోడ్లో జగన్ పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక జగన్ కి జనంలో బలం ఉన్నంతవరకూ ఎవరూ ఏమీ చేయలేరన్న నిజాన్ని తాజా ఎన్నికలు చాటాయి.
కమల వ్యూహాలు….
ఈ విషయం కమలనాధులకు తెలియనిది కాదు అనుకోలేం. జగన్ బలమంతా జనమే కాబట్టి జనంలోనే ఆయన్ని ముందు బదనాం చేస్తే తాము అనుకున్నది సాధించగలమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారుట. అందుకే ప్రత్యేక హోదా విషయంలో మేము ఇవ్వం అంటూ జగన్ ని మొదట్లోనే వంచేశారు. ఇక ఏపీకి రావాల్సినవి, ఇవ్వాల్సినవి ఇవ్వకుండానే కేంద్ర బడ్జెట్ లో మమ అనిపించేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ ప్రాజెక్టుల్లో అవినీతి అంటూ తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఏపీ రాజకీయాల్లో, వివిధ పార్టీల రాజకీయ నాయకులలో కూడా చర్చగా ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ చేస్తున్న ప్రయత్నాలు జనం మెచ్చవచ్చేమో కానీ రాజకీయ జీవులకు మింగుడుపడదన్నది నిజం. ఏ పార్టీలో ఉన్నా కూడా నాయకులు పదవుల్లోకి వచ్చేది కాస్తో కూస్తో ఆదాయం రాబట్టుకునేందుకే. అందువల్ల జగన్ ప్రవచించే నీతి కధలు, కబుర్లు ఎవరికీ పెద్దగా వంటబట్టవంటే అందులో విచిత్రం లేదు. వైసీపీలోనూ ఇదే విషయంపై అసంతృప్రి ఇప్పటైకైతే రేఖామాత్రంగా ఉంది. దాన్ని పెంచి పెద్ద చేస్తే మాత్రం జగన్ కి ఇబ్బందులు తప్పవు.
రాయపాటి బాంబు….
ఏపీకి చెందిన సీనియర్ మోస్ట్ నేత రాయపాటి సాంబశివరావు. ఢిల్లీ రాజకీయాల్లో ఆయన పండిపోయినవారు. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా కూడా ఆయనకే తొలిగా తెలుస్తుంది. అటువంటి రాయపాటి తాజాగా ఓ బాంబు పేల్చారు. అదేమంటే బీజేపీకి దక్షిణాదిన అధికార దాహం పెరిగిందని, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలో చాలా త్వరగా అధికారంలోకి రావాలని చూస్తోందని పేర్కొన్నారు. అంటే ఎన్నికల రాజకీయాల ద్వారా కాదన్న మాట. తన వ్యూహాలలో భాగంగా సామధాన భేద దండోపాయాలు ఉపయోగించైనా బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. బీజేపీ చూపు ముందు తెలంగాణా మీద ఉందని, అక్కడ కేసీఆర్ సర్కార్ ని అస్థిరపరచేందుకు కార్యాచరణ రెడీ చేస్తున్నారని, అక్కడ కానీ సక్సెస్ అయితే మాత్రం ఏపీలో జగన్ సర్కార్ ని కూడా కూల్చినా ఆశ్చర్యపోనవసరం లేదని రాయపాటి బాంబు లాంటి విషయాలే చెప్పారు. అంటే జగన్ ఎంత స్నేహంగా ఉన్నా మోడీ, షా ద్వయం ఏపీ మీద కన్నెసి ఉంచారని అర్ధమైపోతోంది. జగన్ కి ఏ మాత్రం సాయం చేయకుండానే జనంలో పలుచన చేస్తారన్నమాట. వీలుంటే ఆయన మీద కేసులను తిరగతోడరారని కూడా రాయపాటి మాటల్లో తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే జగన్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని రాయపాటి మాటలు స్పష్టం చేస్తున్నాయి.