జస్టిస్ అంటే…ఆయనే
శాసన, కార్యనిర్వాహఖ, న్యాయవ్యవస్థలు భారత రాజ్యాంగంలో ప్రధాన అంశాలు. ఈ మూడూ వేటికి అవే స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలు. సందర్భం వచ్చినప్పుడు ఆయా వ్యవస్థల్లోని వ్యక్తులు [more]
శాసన, కార్యనిర్వాహఖ, న్యాయవ్యవస్థలు భారత రాజ్యాంగంలో ప్రధాన అంశాలు. ఈ మూడూ వేటికి అవే స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలు. సందర్భం వచ్చినప్పుడు ఆయా వ్యవస్థల్లోని వ్యక్తులు [more]

శాసన, కార్యనిర్వాహఖ, న్యాయవ్యవస్థలు భారత రాజ్యాంగంలో ప్రధాన అంశాలు. ఈ మూడూ వేటికి అవే స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థలు. సందర్భం వచ్చినప్పుడు ఆయా వ్యవస్థల్లోని వ్యక్తులు చరిత్ర సృష్టిస్తారు. చరిత్రలో మిగిలిపోతారు. ప్రజల కోసం పనిచేసిన నాయకుడు వారి గుండెల్లో నిలిచిపోయినట్లే…. పేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూర్చి అధికారులు, కలెక్టర్లు వారి మనస్సుల్లో నిలిచిపోతారు. టంగుటూరి అంజయ్య, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి నాయకులు తమ సేవల ద్వారా ప్రజల ఆదరాభిమనాలు చూరగొన్నారు. ఒకప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఏవీఎస్ రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆర్.ఎస్. శంకరన్, టీటీడీ ఈవో గా పనిచేసిన పీవీఆర్కే ప్రసాద్ వంటి ఐఏఎస్ అధికారులు తమ సర్వీసులో చేసిన పనుల ద్వారా ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
న్యాయవ్యవస్థలోనూ….
న్యాయవ్యవస్థ కూడా అలాంటిదే. న్యాయమూర్తులు ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయకపోయినప్పటికీ, వారు ఇచ్చే కీలక తీర్పుల ద్వారా చరిత్ర గతిని మార్చివేయగలరు. ప్రజల మనస్సుల్లోనూ చిరకాలం నిలిచిపోగలరు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ ఈ కోవకు చెందిన వారే. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయనున్న దశలో ఆయన ఇచ్చిన తీర్పు రాజకీయ దిగ్గజం పళనియప్పన్ చిదంబరం జీవితాన్ని తారుమారు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి బెయిల్ నిరాకరించడం ద్వారా సునీల్ గౌర్ చరిత్రలో నిలిచిపోయారు. వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఇప్పటికీ ఏడాదికి పైగా బెయిల్ పై ఉన్న వ్యక్తి మళ్లీ బెయిల్ పొందడానికి అనర్హుడు అటూ ఆయన చేసిన పదునైన, సూటి వ్యాఖ్యలు వాస్తవానికి దర్పణం పడతాయి. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే కేంద్ర మాజీ మంత్రి పాత్ర ఉన్నట్లు అర్థమవుతుందన్న సునీల్ గౌర్ వ్యాఖ్యలు చిదంబరం పరిస్థితిని మార్చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడం ద్వారా జస్టిస్ సునీల్ గౌర్ సరైన నిర్ణయం తీసుకున్నారన్న విషయం స్పష్టమవుతోంది.
ఇతర కేసుల్లోనూ…..
సునీల్ గౌర్….. ఒక్క చిదంబరం కేసులోనే కాదు ఇతర కేసుల్లోనూ వాస్తవాల ప్రాతిపదికన వ్యవహరించి చరిత్ర సృష్టించారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త రతుల్ పురికి బెయిల్ నిరాకరించడంతో ఆయన అరెస్ట్ అయ్యారు. పూరీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాధ్ మేనల్లుడు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ప్రాసిక్యూషన్ కు అనుమతించడం ద్వారా జస్టిస్ సునీల్ గౌర్ చరిత్ర సృష్టించారు. మాంసం ఎగుమతి వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులోనూ జస్టిస్ సునీల్ గౌర్ కీలకమైన ఉత్తర్వులు జారీ చేశారు.
పదవీ విరమణ చేసినా…..
చిదంబరం కేసులో ఆదేశాలు ఇచ్చిన రెండు రోజుల అనంతరం సునీల్ గౌర్ పదవీ విరమణ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని బులంర్ షహర్ లో 1957 ఆగస్టు 23న సునీల్ గౌర్ జన్మించారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన అనంతరం 1984 నుంచి పంజాబ్ – హర్యానా హైకోర్టు లో పదేళ్ల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. సివిల్, క్రమినల్, రాజ్యాంగ కేసుల్లో నిపుణుడిగా పేరు తెచ్చుకున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కీలక కేసులను విచారించారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్ట్ శివానీ భట్నాగర్ కేసు వీటిలో ఒకటి. న్యాయమూర్తిగా పదవీ విరమణ సందర్భంగా జస్టిస్ సునీల్ గౌర్ పై ప్రశంసల జల్లు కురిసింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరూభాయ్ నారాయణ్ భాయ్ పటేల్ మాట్లాడుతూ జస్టిస్ సునీల్ గౌర్ సేవలను ప్రశంసించారు. బాధ్యతల నిర్వహణలో ఆయన నిబద్దత తిరుగులేనిదని, న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెంచే విధంగా వ్యవహరించారని ప్రశంసించారు. సహచర న్యాయమూర్తులు సయితం సునీల్ గౌర్ సేవలు, వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
ఎందరో….ఎన్నెన్నో…..
గతంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించిన జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా 70వ దశకంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు నిచ్చి సంచలనం సృష్టించారు. 1971లో రాయబరేలీ స్థానం నుంచి ఆమె ఎన్నిక చెల్లదంటూ, ప్రత్యర్థి రాజ్ నారాయణ్ దాఖలు చేసిన కేసులో ఇందిర తప్పు చేసిందని, 1975 జూన్ 12న ఆయన చెప్పిన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఈ తీర్పు వచ్చిన 13 రోజుల్లోనే జూన్ 25న ఇందిరా గాంధీ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఇది అనేక విపరిణామాలకు దారితీసిన సంగతి తెలిసిందే. బస్సు రూట్ల జాతీయ కరణ కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో 1964 ఫిబ్రవరి 29న నాటి ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి రాజీనామా చేశారు. పశుదాణా కుంభకోణం కేసులో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ జీవితాన్ని అంధకారంలో పెట్టింది. ఉమ్మడి ఏపీ సీఎం నేదురుమిల్లి జనార్థన్ రెడ్డి వైద్య కళాశాలల కుంభకోణం కేసులో హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఆయన రాజీనామా చేశారు. చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
-ఎడిటోరియల్ డెస్క్