జగన్ వ్యూహం: అభివృద్ధి, పార్టీ దూకుడు
రాజధాని జిల్లా గుంటూరుపై సీఎం జగన్ వ్యూహం ఏంటి? ఎన్నో ఆశలతో, మరెన్నో లక్ష్యాలతో ప్రారంభమైన రాజధాని నిర్మాణాలు ఎప్పటికి పూర్తయ్యేను? జగన్ ఏ విధంగా ముందుకు [more]
రాజధాని జిల్లా గుంటూరుపై సీఎం జగన్ వ్యూహం ఏంటి? ఎన్నో ఆశలతో, మరెన్నో లక్ష్యాలతో ప్రారంభమైన రాజధాని నిర్మాణాలు ఎప్పటికి పూర్తయ్యేను? జగన్ ఏ విధంగా ముందుకు [more]

రాజధాని జిల్లా గుంటూరుపై సీఎం జగన్ వ్యూహం ఏంటి? ఎన్నో ఆశలతో, మరెన్నో లక్ష్యాలతో ప్రారంభమైన రాజధాని నిర్మాణాలు ఎప్పటికి పూర్తయ్యేను? జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఇలాంటి అనేక ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. మాయా మశ్చీంద్రను తలపించే గుంటూరు అభివృద్ధి విషయంలో జగన్ ఏ విధంగా దూసుకుపోతారనేది కూడా కీలకమైన అంశం. జిల్లా పరిస్థితిని గమనిస్తే.. గత ప్రబుత్వం దీనిని రాజధానిగా గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అయితే, ఇక్కడ రైతుల నుంచి దాదాపు 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సమీకరించినట్టు చెప్పుకొన్నా, చాలా వరకు భూమిని బెదిరించి తీసుకున్నారనేది అప్పటి విపక్షం వైసీపీ ఆరోపణ.
ఈ క్రమంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ రాజధానిని ఏం చేయనుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. సీఎం గా ప్రమాణ స్వీకారం చేయకముందుగానే రాజధాని భూముల్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయని జగన్ వెల్లడించారు. వాటిపై తాను విచారణ చేయిస్తానని రివర్స్ టెండరింగ్ చేపడతానని చెప్పారు. దీంతో రాజకీయంగా రాజధాని విషయం సంచలనంగా మారింది. ఇదిలా వుంటే, గుంటూరులోని మొత్తం 17 అసెంబ్లీ స్థానాల్లో 15 చోట్ల వైసీపీవిజయం సాధించింది. కేవలం రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం దక్కించుకుంది. కీలకమైన గుంటూరు ఎంపీ సీటును కూడా టీడీపీ దక్కించుకుంది. అయినప్పటికీ.. జగన్ ఈ జిల్లా నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు అప్పగించారు.
అది కూడా ప్రత్తి పాడు నుంచి విజయం సాధించిన మేకతోటి సుచరితకు ఏకంగా హోం శాఖను, రేపల్లె నుంచి గెలవకపో యినా.. ఎమ్మెల్సీ కోటాలో బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణకు జగన్ ఛాన్స్ కల్పించారు. దీంతో ఈ ఇద్దరిపైనా ఇప్పుడు గుంటూరు అభివృద్ధి ఆధారపడిందనేది వాస్తవం. రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా కీలకం. అలాంటి జిల్లాలో సుచరిత మంత్రి పదవికి కొత్త… మోపిదేవి గతంలో మంత్రిగా పనిచేశారు. నిజానికి ఈ జిల్లాకు మరో రెండు మంత్రి పదవులు దక్కి ఉండాల్సింది. వీరిలో మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్‌పై విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, చిలకలూరిపేటలో తన టికెట్‌ను సైతం త్యాగం చేసిన మర్రి రాజశేఖర్‌కు కూడా జగన్ మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఈ క్రమంలో ఇక్కడ నుంచి మంత్రులు అయిన ఇద్దరిలో మేకతోటి సుచరిత, మోపిదేవిలపైనే రాజధాని అభివృద్ధి డిపెండ్ అయి ఉంది. వీటికి తోడు రాష్ట్రంలోనే బాగా వెనకపడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న పల్నాడులో అభివృద్ధి అంతంత మాత్రం. ఈ ప్రాంతంలో సాగు, తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సాగర్ పక్కనే ఉన్నా మాచర్ల, వినుకొండ, గురజాల లాంటి నియోజకవర్గాల ప్రజలు తాగు, సాగునీటికి కటకటలాడుతున్నారు. అదే విధంగా డెల్టా ప్రాంతమైన రేపల్లెలోనూ అనేక సమస్యలు ఉన్నాయి. ఇక రాజధాని నిర్మాణ నిర్వాసితులతో పాటు జిల్లాలో ఉన్న అనేక సమస్యలను ఈ ఇద్దరు మంత్రులు ఎలా అధిగమిస్తారు? జిల్లాలో పార్టీని ఎలా బలోపేతం చేస్తారు? అనేది కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.