కమలం కనుసన్నల్లో …!!
దేశ రాజకీయ యవనికపై గుత్తాధిపత్యాన్నిసాధించిన భారతీయ జనతాపార్టీ ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లోనూ తనమాటే చెల్లుబాటయ్యేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సామదానభేదోపాయాలు ప్రయోగించేందుకు పూనుకుంటోంది. ఈ [more]
దేశ రాజకీయ యవనికపై గుత్తాధిపత్యాన్నిసాధించిన భారతీయ జనతాపార్టీ ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లోనూ తనమాటే చెల్లుబాటయ్యేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సామదానభేదోపాయాలు ప్రయోగించేందుకు పూనుకుంటోంది. ఈ [more]

దేశ రాజకీయ యవనికపై గుత్తాధిపత్యాన్నిసాధించిన భారతీయ జనతాపార్టీ ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లోనూ తనమాటే చెల్లుబాటయ్యేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. సామదానభేదోపాయాలు ప్రయోగించేందుకు పూనుకుంటోంది. ఈ చిట్టాలో మొదటి స్థానం పొందుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎప్పట్నుంచో బీజేపీకి అనేకవిధాలుగా రాజకీయ సహకారం అందిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా కనబరిచిన చొరవ పూర్తిగా రివర్స్ అయ్యింది. రాష్ట్రప్రభుత్వంపై కాంగ్రెసు కంటే బీజేపీ నేతలే ఎక్కువగా విరుచుకుపడుతున్నప్పటికీ టీఆర్ఎస్ సమర్థంగా తిప్పికొట్టలేకపోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ సంగతైతే చెప్పనే అక్కర్లేదు. వైసీపీ ప్రభుత్వ విధానాలు సమగ్రంగా లేవు. తిరోగమన చర్యలు తీసుకొంటోందని బీజేపీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. చాలా పేలవంగా మాత్రమే మంత్రులు బదులిస్తున్నారు. ఇంకా వైసీపీ నేతలు టీడీపీపైనే విరుచుకుపడుతున్నారు. బీజేపీ జోలికెళ్లడం లేదు. కానీ టీడీపీ స్ట్రైకింగ్ రేటును మించి బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తూ వైసీపీని టార్గెట్ చేయడాన్ని విశేషంగా చెప్పాలి.
సయోధ్య యాత్ర…
కేంద్రప్రభుత్వం తీవ్రస్థాయిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో విభేదిస్తున్నట్లుగా ప్రచారం ఊపందుకుంది. కేంద్రంతో చెప్పే తాము నిర్ణయాలు తీసుకుంటున్నామంటూ విజయసాయిరెడ్డి ప్రకటించారు. కొంత వ్యతిరేకతను సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. దానిని ఖండిస్తూ బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఈనేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలతో సంప్రతింపులకు దిగారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయపరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రం సైతం అడ్డుపుల్ల వేస్తే ప్రాజెక్టు నిలిచిపోతుంది. దాని వల్ల ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ సామర్థ్యంపై అనుమానాలు తలెత్తుతాయి. తీవ్రమైన నష్టం ఏర్పడుతుంది. రాజధానిపై కూడా తొందరపాటు తనంతో మంత్రులు రకరకాల సందేహాలు, వదంతులు వ్యాపింపచేశారు. వీటన్నిటినీ అడ్డుపెట్టుకుని కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి సహకరించడం మానేస్తే ఆర్థికంగా అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు. అందువల్ల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పూర్తిగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య నెలకొన్న అపోహలపై వివరణ ఇవ్వడానికే వినియోగించుకున్నారు. హోంమంత్రి, జలశక్తిమంత్రి, ఆర్థిక మంత్రి ముగ్గురూ సహకరిస్తేనే క్రిటికల్ దశలో ఉన్న ఏపీ ప్రయోజనాలు నెరవేరుతాయి. పూర్తి సానుకూలంగా కేంద్రం స్పందించలేదనేది ఢిల్లీ వర్గాల సమాచారం. బీజేపీ నాయకులు, ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ప్రతినిధులు రాష్ట్రప్రభుత్వంపై నిర్హేతుకంగా విమర్శలు గుప్పిస్తున్నారని జగన్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
వికేంద్రీకరణకు ఓకే…
కేంద్రప్రభుత్వం తెలుగు రాష్ట్రాలతో రాజకీయ సయ్యాట సాగిస్తోంది. తెలుగుదేశం కేంద్రానికి దాదాపు సరెండర్ అయిపోయింది. చంద్రబాబు నాయుడి సమావేశాలు, పర్యటనలు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్నాయి. రాష్ట్రప్రభుత్వంపై పోరాటం విషయంలో టీడీపీ చేతులెత్తేసినట్లే. దీనిని ఆసరా చేసుకుంటూ బీజేపీ క్రమేపీ రాజకీయంగా పట్టు పెంచుకుంటోంది. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రజాకోణంలో వ్యతిరేకించేందుకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చర్చల సందర్భంగా రివర్స్ టెండరింగ్, ఇన్ సైడర్ ట్రేడింగ్ రాజధాని అంశాలపై తాము కూడా అధ్యయనం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం వెళ్లాలనుకుంటే సహకరించేది లేదని తేల్చి చెప్పేసినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారు. అందువల్లనే జగన్ కేంద్రమంత్రులను కలిసిన తర్వాత సైతం రాష్ట్ర బీజేపీ నాయకుల దాడి ఆగలేదు. ప్రజల సెంటిమెంటుతో ముడిపడిన విషయాలు, మతపరమైన భావనలతో కూడిన సైద్దాంతిక అంశాల్లో వైసీపీని టార్గెట్ చేయాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అమరావతి నిర్మాణంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగినట్లుగా వైసీపీ ప్రభుత్వం ఒకదానితర్వాత ఒకటిగా ఆధారాలు బయట పెట్టాలని భావిస్తోంది. దాంతో తెలుగుదేశం పార్టీ కి మరింత డ్యామేజీ ఖాయం. అదే సమయంలో ప్రజలకు అండగా ఉంటున్నట్లుగా ఆందోళనలతో బీజేపీ బలపడవచ్చని అంచనా వేస్తోంది. అధికార వికేంద్రీకరణ విషయంలో మాత్రం రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ , జగన్ ల మైత్రికి ఎసరు…
సర్దుకుపోదామని చూస్తున్నా కేసీఆర్ కు కమలం సెగ ఘాటుగానే తగులుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా దున్నేద్దామనుకున్న యత్నాలు ఫెయిల్ అయిన తర్వాత కేసీఆర్ చాలావరకూ కేంద్రప్రభుత్వ విషయాల్లో మౌనం వహిస్తున్నారు. కానీ బీజేపీ రాష్ట్రనాయకులు మాత్రం ప్రతి విషయంలోనూ టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను నిలుపుదల చేయించేందుకు న్యాయపోరాటానికి సైతం సిద్ధమవుతున్నారు. కేసీఆర్ కు బీజేపీ నాయకుల వైఖరి చాలా చికాకుగా పరిణమించింది. కానీ నిస్సహాయత వెన్నాడుతోంది. కేటీఆర్ మాత్రమే అప్పుడప్పుడు బీజేపీని కౌంటర్ చేస్తున్నారు. మంత్రులు దాదాపు మాట్లాడటం లేదు. కేసీఆర్ తాను స్వయంగా రాష్ట్ర బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ మాట్లాడదామంటే తన స్థాయి పడిపోతుందనే భావనలో ఉన్నారు. అందుకే అధికారులే బీజేపీకి కౌంటర్ ప్రకటనలు ఇవ్వాలని చెబుతున్నారు. అధికారయంత్రాంగం మాత్రం దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. టీఆర్ఎస్ ,బీజేపీ రాజకీయ పోరులోకి దిగాలని అధికారులెవరూ భావించడం లేదు. మంత్రులు పూనిక వహించి ప్రకటనలు జారీ చేయడానికి ముందుకు వస్తే సమాచారాన్ని మాత్రం అందచేస్తామని కొందరు అధికారులు తేల్చి చెబుతున్నారు. రాజకీయ పరమైన వివాదాల్లో తాము అనవసరంగా జోక్యం చేసుకుని వివాదాల పాలవ్వకూడదనేది అధికారయంత్రాంగం భావన. ఇంకోవైపు జగన్ కు, కేసీఆర్ కు మధ్య ఏర్పడిన మైత్రీ బంధాన్ని కూడా విచ్ఛిన్నం చేయాలని బీజేపీ యత్నిస్తోంది. కేసీఆర్ గ్రిప్ లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాజకీయ ప్రయోజనాలు దెబ్బతింటాయన్న విషయాన్ని బీజేపీ అగ్రనాయకులు వైసీపీకి నూరిపోస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థిక వనరుల విషయంలోసంకట పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి. ఇది కూడా తమకు లాభించే పరిణామమేనని బీజేపీ నాయకత్వం తలపోస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్