Mon Jan 20 2025 10:15:05 GMT+0000 (Coordinated Universal Time)
వాటర్ బాటిల్ కు బదులు యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి.. ఆస్పత్రిలో విద్యార్థి
ఆ షాపు యజమాని చైతన్యకు వాటర్ బాటిల్ కు బదులు.. యాసిడ్ నింపి ఉన్న బాటిల్ ఇచ్చాడు. దాహంతో ఉన్న చైతన్య వెంటనే..
విజయవాడ : ఓ వ్యాపారి నిర్లక్ష్యం విద్యార్థి ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ విద్యార్థి వాటర్ బాటిల్ అడగ్గా.. యాసిడ్ బాటిల్ ఇచ్చాడు వ్యాపారి. ఫలితంగా ఆ విద్యార్థి ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన కోసూరు చైతన్య అనే విద్యార్థి లయోలా కాలేజీలో ఏవియేషన్ విభాగంలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 14వ తేదీన చైతన్య ఎండతీవ్రతను తట్టుకోలేక ఎనికేపాడు వద్ద ఓ దుకాణంలో వాటర్ బాటిల్ కొన్నాడు.
కానీ.. ఆ షాపు యజమాని చైతన్యకు వాటర్ బాటిల్ కు బదులు.. యాసిడ్ నింపి ఉన్న బాటిల్ ఇచ్చాడు. దాహంతో ఉన్న చైతన్య వెంటనే తాగేశాడు. మంటతో విలవిల్లాడిన చైతన్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యాసిడ్ శరీరంలోకి వెళ్లిపోవడంతో..అవయవాలు స్వల్పంగా పాడయ్యాయి. ప్రస్తుతం చైతన్య ప్రైవేటు ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో చైతన్య ఆసుపత్రి ఖర్చులను భరించేందుకు లయోలా కాలేజీ ముందుకొచ్చింది.
Next Story