Andhra Pradesh : జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష
జిల్లా కలెక్టర్ల సమావేశంలో భూ పరిపాలన, ఆదాయార్జన శాఖలపై సమీక్ష జరిగింది

జిల్లా కలెక్టర్ల సమావేశంలో భూ పరిపాలన, ఆదాయార్జన శాఖలపై సమీక్ష జరిగింది. రవాణా,రోడ్లు భవనాల శాఖపై ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, వార్షిక లక్ష్యాల సాధనపై వివరిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం లో వాహనాల పన్నుల ద్వారా రూ. 5,930 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా మార్చి 9 నాటికి రూ. 4,501 కోట్లు అనగా 76 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని ఆయన వెల్లడించారు. గత ఐదేళ్ల ఆదాయ వృద్ధిని వివరిస్తూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం రవాణా ఆదాయం రూ. 4,125.67 కోట్ల నుంచి రూ. 4,389.03 కోట్లకు పెరిగి 6.38% వృద్ధి నమోదైందని చెప్పారు. త్రైమాసిక పన్నుల వసూళ్లలో 2.03% వృద్ధి సాధించామని, ముఖ్యంగా వాహనాల తనిఖీల్లో ఏకంగా 71.06 శాతం అద్భుత వృద్ధి రేటును నమోదు చేశామని వివరించారు. అలాగే ఫీజులు, యూజర్ ఛార్జీలు, కేంద్ర ప్రభుత్వ నిధుల రూపంలో వచ్చే ఆదాయం కూడా 19.51% పెరిగిందని తెలిపారు.

